రేషన్ దుకాణంలో పురుగులు పట్టి, ఉండలు కట్టిన బియ్యం
♦ గోడౌన్లలో రేషన్ బియ్యం పరిశుభ్రత గాలికి
♦ ఉండలు కట్టి, పురుగు పట్టిన బియ్యమే సరఫరా
♦ అంగన్‌వాడీలు, విద్యార్థులకూ అవే దిక్కు
♦ మామూళ్ల మత్తులో అధికారులు
బమోమెట్రిక్ వచ్చినా.. ఈ పోస్ పెట్టినా.. ఉన్నతాధికారులు హెచ్చరించినా.. తీరు మారలేదు. పేదోడి ఎండిన డొక్కలు నింపే రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆగలేదు. గోడౌన్‌లో సరుకు రేషన్ దుకాణాలకు చేరకుండానే నల్లబజారుకు తరలిపోతోంది. ఈ మధ్యలో జరుగుతున్నదంతా అవినీతి నాటకమే.. ఈ దోపిడీ నాటకంలో అధికార పార్టీ నేతలు తెర వెనుక సూత్రధారులైతే.. రేషన్ డీలర్లు పాత్రధారులు. ఇవన్నీ తెలిసినా కళ్లప్పగించి చూస్తూ మామూళ్ల మత్తులో జోగే అధికారులు ప్రేక్షకులు. ఇదీ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ తీరు.. కాదు కాదు దోపిడీకి గురవుతున్న నిరుపేదల ఆకలి కన్నీరు.
సాక్షి, అమరావతి బ్యూరో : సివిల్ సప్లయ్స్ అధికారుల తీరు మారలేదు. జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా గత నెలలో సివిల్ సప్లయ్స్ అధికారులు, గోడౌన్ ఇన్‌చార్జిలు, సీఎస్ డీటీలతో సమావేశం ఏర్పాటు చేసి పనితీరు మార్చుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వారిలో మార్పు రాలేదు. గుంటూరు నగరంలో పలు రేషన్ షాపులకు తూకాలు వేయకుండానే డీలర్లకు సరుకు పంపారు. కొన్ని వాహనాలకు జీపీఎస్ లేకుండానే బియ్యాన్ని తరలించారు. గోడౌన్‌లలో పరిశుభ్రతను గాలికొదిలేశారు. గుంటూరు, తెనాలిలలోని గోడౌన్‌లలో బియ్యం పురుగు పట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు.
గోడౌన్‌లలో లీకేజీలు, ప్యూమిగేషన్ షెడ్యూల్ గురించి సిబ్బంది మరిచిపోయారు. గోడౌన్‌ల నుంచే నేరుగా సరుకు నల్ల బజారుకు తరలుతున్నా వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఆ తరువాత డీలర్లు, కార్డుదారులతో గుర్తు వేయించుకొని, బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి పంపుతున్నారు. తూకాలలో తేడాలు గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తారని డీటర్లు భయపడిపోతున్నారు. అధికారులు కొన్ని షాపులు తనిఖీ చేసిన బియ్యం తక్కువ నిల్వలు ఉన్నట్లు తెలిసింది.
మార్క్ లేకుండానే బియ్యం సరఫరా
గోడౌన్‌లలో ఉన్న బియ్యంలో కొద్దిగా మెరుగ్గా ఉన్న బియ్యం సంచులను పక్క తీసి, వాటికి ప్రత్యేకంగా మార్క్ చేయాలి. ఆ విధానం గుంటూరు నగరం పరిధిలోని గోడౌన్‌లో అమలు కావటం లేదు. కార్డుదారులకు ఇచ్చే బియ్యానే అంగన్‌వాడీలకు పంపుతున్నారు. మ««ధ్యాహ్న భోజనం, హాస్టల్ విద్యార్థులకు అవే బియ్యాన్ని అంటగడుతున్నారు. ఇవి పురుగుపట్టి, ఉండలు కట్టి ఉంటున్నాయి. గుంటూరు పరిసరాలలోని గౌడౌన్‌లలో జరిగిన అవకతకలపై ఇటీవలే డీటీలపై చర్యలు తీసుకొన్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు.
తనిఖీలు చేస్తున్నాం
ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలయ్యేందుకు తనిణీ చేస్తున్నాం. వీలైనంత వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు మార్క్ చేసిన బియ్యాన్నే డీలర్లకు పంపుతున్నాం. ఎక్కడైనా నాణ్యతలేని బియ్యం వస్తే వాటిని రీ ప్లేస్ చేస్తాం. అవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు తప్పవు.
– చిట్టిబాబు, డీఎస్‌వో, గుంటూరు