చింతమనేని వైఖరిని నిరసిస్తూ జర్నలిస్టుల ధర్నా
Published Sat, Dec 24 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : టీవీ జర్నలిస్టుపై దౌర్జన్యానికి పాల్పడిన ప్రభుత్వ విప్, చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరులో జర్నలిస్టులు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పౌర సంబంధాధికారి కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేన్ వద్దకు చేరుకుంది. పోలీస్‌స్టేన్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ నాయకులు కె.మాణిక్యరావు, జి.రఘురాం, జీవీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తోందో, నిరంకుశపాలన నడుస్తోందో అర్థం కాకుండా ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా అహర్నిశలూ కష్టపడి పనిచేసే జర్నలిస్టులపై సాక్షాత్తూ ప్రభుత్వ ప్రతినిధులే దాడి చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుందని ప్రశ్నించారు. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు తగిన సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు పి.రవీంద్రనాథ్, పలువురు ప్రింట్ మీడియా, ఎలక్టాన్రిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
Advertisement