మన్యంలో జూనియర్ సివిల్ జడ్జి పర్యటన
బుట్టాయగూడెం : మండలంలోని మారుమూల గ్రామమైన దండిపూడిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొనేందుకు వెళ్లిన జంగారెడ్డిగూడెం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డి.అజయ్‌కుమార్ నక్సల్స్ ప్రభావిత అటవీ కొండ ప్రాంతంలో సుమారు కిలోమీటరున్నర నడుచుకుంటూ వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో పర్యటించిన తొలి న్యాయమూర్తి కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన పర్యటనలో ఆ ప్రాంత కొండరెడ్డి గిరిజనుల పోడు వ్యవసాయం, వారు పండించే పంటలు, వారి స్థితిగతులు, సంస్కతి సంప్రదాయాల గురించి అక్కడవారిని అడిగి తెలుసుకున్నారు.
మారుమూల కుగ్రామమైన దండిపూడిలో మెడికల్ క్యాంపుకు జడ్జి పాల్గొంటున్నారని సమాచారం అందుకున్న పోలీసులు తొలుత అభ్యంతరం తెలిపారు. అయినా న్యాయవాదులు అంగీకరించలేదు. వైద్య శిబిరంలో పాల్గొన్న జడ్జి ఆ కొండ ప్రాంత వాతావరణం చూసిన వెంటనే అటువైపు పర్యటించారు. మధ్యాహ్న సమయానికి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని జడ్జి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.