మహిళల కబడ్డీ విజేత వైజాగ్‌ | kabaddi winner vizag team | Sakshi
Sakshi News home page

మహిళల కబడ్డీ విజేత వైజాగ్‌

Published Thu, Oct 13 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

మహిళల కబడ్డీ విజేత వైజాగ్‌

మహిళల కబడ్డీ విజేత వైజాగ్‌

నూజివీడు : దసరా సందర్భంగా నూజివీడులో మూడు రోజులుగా సాగుతున్న అఖిల భారత 65వ పురుషుల చెడుగుడు, మహిళల కబడ్డీ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. మహిళల కబడ్డీ పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలవగా, గత ఏడాది విజేత అయిన విజయనగరం జట్టు ద్వితీయస్థానంతో సరిపెట్టుకుంది. లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ పోటీలో ప్రారంభం నుంచి  ఉత్తమ ప్రతిభ చూపిన విశాఖపట్నం, విజయనగరం జట్లు ఫైనల్‌కు చేరాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విశాఖపట్నం జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించి విజయాన్ని సాధించి విజేతగా నిలిచింది. గత ఏడాది మాదిరిగానే కృష్ణాజట్టు మూడో స్థానంలోను, తూర్పుగోదావరి జట్టు నాల్గో స్థానంలోనూ నిలిచాయి. 
హోరాహోరీగా ఫైనల్‌
విశాఖపట్నం, విజయనగరం జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. ప్రథమార్థం నిలిచే సరికి 13–10 పాయింట్లతో విజయనగరం జట్టు ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో విశాఖ జట్టు తమ మెరుగైన ఆటతీరుతో రైడర్లు వరుసగా పాయింట్లు తీసుకురావడంతో 17–13 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంకా ఆట రెండు నిమషాలుందనగా, ఇరుజట్లు వరుసగా పాయింట్లు సాధించినప్పటికీ చివరికి 21–17 స్కోరుతో విశాఖపట్నం విజయాన్ని సాధించింది. విశాఖ జట్టు డిఫెన్స్‌లోను, ఎఫెన్స్‌లోను పూర్తి ఆధిక్యతను సాధించింది.  
ఆటలకు నిలయం నూజివీడు : ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు
నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, సినీహీరో వేణు, కావూరి భాస్కర్, మూల్పురి లక్ష్మణస్వామి చేతులమీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్‌ మాట్లాడుతూ నూజివీడులో పూర్వకాలం నుంచి ఆటలకు గొప్ప పేరుందన్నారు. నటుడు వేణు మాట్లాడుతూ 65 ఏళుల్గా అఖిల భారతస్థాయిలో చెడుగుడు పోటీలు నిర్వహిస్తున్నారంటే మామూలు విషయం కాదన్నారు. కార్యక్రమంలో  స్పోర్టింగ్‌ క్లబ్‌ అధ్యక్షుడు బొబ్బిలి కొండలరావు, కార్యదర్శి టీవీ కృష్ణారావు, ఉపాధ్యక్షుడు గాజుల శోభనాచలం, స్పోర్టింగ్‌ క్లబ్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement