మనసు విప్పి మాట్లాడేందుకు వచ్చా.
గుంటూరు వైద్య కళాశాలలో మంత్రి కామినేనికి సన్మానం
గుంటూరుమెడికల్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు ఆదివారం రాత్రి గుంటూరు వైద్య కళాశాలలో ఘన సన్మానం జరిగింది. ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని మాట్లాడుతూ తాను సన్మానం కోసం రాలేదని, వైద్యులతో మనస్సు విప్పి మాట్లాడేందుకు వచ్చానని తెలిపారు. వైద్య వ్యవస్థ ఉంది రోగి కోసమేనని, రోగికి నమ్మకం కల్పించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్యులు సమాజానికి, వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. మనం నిజాయితీగా ఉండి ఏది చెప్పినా సిబ్బంది వింటారన్నారు. ప్రభుత్వ వైద్యులు సాయంత్రం వేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకోవటాన్ని తాను సమర్థిస్తున్నట్లు చెప్పారు. హెల్త్ యూనివర్శిటీలో పరిశోధనలు జరగాలని, అందుకోసం వైజాగ్ విమ్స్‌ను యూనివర్శిటికి అనుబంధం చేస్తున్నామని వెల్లడించారు.
అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరలోనే బస్సులను కొనుగోలు చేసి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ సుబ్బారావు, అకడమిక్ డీఎంఈ డాక్టర్ బాబ్జి, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజారావు, ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అప్పలనాయుడు, వైద్యుల సంఘం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డీఎస్‌ఎస్ శ్రీనివాసప్రసాద్, కన్వీనర్ డాక్టర్ జయధీర్‌బాబు, హంస సంఘం అధ్యక్షుడు యోగీశ్వరరెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ లక్ష్మీపతి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బారావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నర్సుల సమస్యలు పరిష్కరించాలి...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు వేతనాలు పెంచాలని, నిబంధనల ప్రకారం సెలవులు మంజూరు చేయాలని తదితర సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి కామినేనికి నర్సుల సంఘం నేతలు అందజేశారు. నర్సుల సమస్యలపై చర్చించేందకు 19న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షురాలు విజయ, జిల్లా అధ్యక్షురాలు తిరుపతమ్మ, సెక్రటరీ ఆశాలత తదితరులు ఉన్నారు.