గుంటూరు: తన పరువు ప్రతిష్టలకు భంగం కలింగించేలా పలు పత్రికలలో ప్రకటనలు ఇచ్చారని ఆరోపిస్తూ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ నాలుగవ అదనపు జిల్లా కోర్టులో సోమవారం ప్రారంభమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. అప్పటి రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు రాష్ట్ర మంత్రివర్గంలో మధుకోడాలు ఉన్నారని అందులో గుంటూరుకు చెందిన మంత్రి ఉన్నారంటూ పత్రికా ప్రకటనలు ఇచ్చారు.
తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఆరోపిస్తూ కన్నా లక్ష్మీనారాయణ రూ. కోటి నష్టపరిహారం కోరుతూ తన న్యాయవాది ఆరెగకూటి సంజీవరెడ్డి ద్వారా లీగల్ నోటీసు ఇచ్చారు. అనంతరం కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సోమవారం ప్రారంభ మైంది. కన్నా లక్ష్మీనారాయణ తన సాక్ష్యాన్ని అఫిడవిట్ రూపంలో కోర్టులో దాఖలు చేశారు.
తన కేసు నిరూపణ కోసం కొన్ని డాక్యుమెంట్లు అఫిడవట్‌తో పాటు దాఖలు చేయగా వాటిలో పేపర్ కటింగ్‌లను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం న్యాయవాద కమిషనర్‌ను నియమించాలని కన్నా లక్ష్మీనారాయణ తరపు న్యాయవాది కోరగా అందుకు రాయపాటి సాంబశివరావు తరపు న్యాయవాది నీలం రామమోహనరావు అభ్యంతరం తెలిపారు. కమిషనర్ అవసరం లేదని ఈ కేసు ప్రాముఖ్యత దృష్ట్యా కోర్టుహాల్‌లోనే జరగాలని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. పిటీషన్ దాఖలు చేస్తే పరిశీలిస్తానని కేసును న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.
రాయపాటిపై ‘కన్నా’ కేసు విచారణ ప్రారంభం
Published Tue, Jul 5 2016 11:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM
Advertisement