కాపు సత్యాగ్రహ యాత్రను విజయవంతం చేయాలి
పి.గన్నవరం : ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 16న కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న కాపు సత్యాగ్రహ యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి పిలుపునిచ్చారు. పి.గన్నవరం గరుడేశ్వర స్వామివారి ఆలయం వద్ద మండల టీబీకే అధ్యక్షుడు కొమ్మూరి మల్లిబాబు అధ్యక్షతన బుధవా రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు రోజులపాటు రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఈయాత్ర జరుగుతుందన్నారు. రాష్ట్ర కాపు రిజర్వేషన్ జేఏసీ జాయింట్ కన్వీనర్లు ఆకుల రామకృష్ణ, నల్లా పవన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ ముద్రగడ పోరాటం వల్లే టీడీపీలోని కాపు నేతలకు గుర్తింపు వచ్చిందన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారన్నారు. కాపు జాతి ముద్రగడ వెన్నంటి ఉన్నారని వారు స్పష్టం చేశారు. అనంతరం సత్యాగ్రహ యాత్రకు సంబంధించిన కరపత్రాలను విష్ణుమూర్తి ఆవిష్కరించారు. టీబీకే నాయకులు ఉలిశెట్టి బాబీ, జక్కంపూడి వాసు, అడ్డగళ్ళ వెంకట సాయిరామ్, ఆర్‌వీ నాయుడు, దాసరి కాశీ, తోలేటి బంగారు నాయుడు, వివిధ గ్రామాలకు చెందిన టీబీకే నాయకులు, యువకులు పాల్గొన్నారు.