కర‘కట్’
-
హంసలదీవి సమీపంలో సముద్ర కరకట్టకు భారీ కోత
-
వరద నీటితో ఉధతంగా ప్రవహిస్తున్న కష్ణమ్మ
-
తీరప్రాంతాల ప్రజల్లో ఆందోళన
కోడూరు:సముద్రం బారి నుంచి దివిసీమ ప్రజలను రక్షించి కాపాడుతున్న ‘దివి రక్షణ’ కవచమైన కష్ణా కరకట్ట భారీస్థాయిలో కోతకు గురవుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీరప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన ప్రకాశం బ్యారేజీ నుంచి పెద్దఎత్తున వరద నీటిని సముద్రంలోకి వదలడంతో కష్ణానదిలో నీటి ఉధతి గంటగంటకు పెరుగుతోంది. బ్యారేజీ దగ్గర వదిలిన నీరు మొత్తం మండల పరిధిలోని హంసలదీవి సమీపంలోని సాగరసంగమం వద్ద సముద్రంలో కలుస్తాయి. అయితే ఈ వరద నీరు మొదట అవనిగడ్డలోని పులిగడ్డ అక్విడెట్ చేరుకొని అక్కడ నుంచి ఉల్లిపాలెం మీదగా సముద్రంలో కలవాల్సి ఉంది. వరదలు, ఉప్పెనలు వచ్చినప్పుడు నీరు ఊళ్ల మీద పడకుండా 2004వ సంవత్సరంలో నాగాయలంక మండలం గుల్లమోద నుంచి ఉల్లిపాలెం వరకు రూ.25కోట్ల వ్యయంతో కరకట్టను నిర్మించారు. అయితే 2008 సంవత్సరంలో వచ్చిన భారీ వరదల ప్రభావానికి ఉల్లిపాలెం సమీపంలో కరకట్టకు భారీ కోత ఏర్పడింది. ఆ కోత ప్రాంతంలో భారీ కొండరాళ్లతో రివిట్‌మెంట్ వేశారు.
మళ్లీ పక్కనే మరో కోత..
మళ్లీ అక్కడే సముద్రం అటుపోట్లతో రెండు నెలల క్రితం కరకట్టకు కోత ఏర్పడింది. తాజా వరద ఉధతికి కోత మరింత ఎక్కువై ఎప్పడైనా గండిపడే ప్రమాదం పెరిగింది. రెండు నెలల నుంచి సమస్యను ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ ఉపద్రవాలు సంభవించక ముందే అధికారులు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.