
కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉంది. దీంతో చంద్రబాబు సిబ్బంది నివాసంలోకి నీరు చేరకుండా ఇసుక బస్తాలు వేస్తున్నారు.
సాక్షి, అమరావతి : కష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉంది. దీంతో నివాసంలోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే బాబు కాన్వాయ్‌ను హ్యాపీ రిసార్ట్స్‌కి తరలించారు.
ఇంట్లోని కింది గదుల్లో ఉన్న సామాన్లను మేడపైకి తరలించారు. వరద ముప్పును ముందే గ్రహించిన చంద్రబాబు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు పయనమైనట్టు సమాచారం. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు.