గూడూరు: ఉద్యమాలతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని.. బలిదానాలు చేసుకోవద్దని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ అన్నారు. ప్రత్యేక హోదా రాదనే కలతతో నెల్లూరు జిల్లా గూడూరులో గుండెపోటుతో మృతి చెందిన లోకేశ్వరరావు మృతదేహాన్ని శుక్రవారం సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారని, అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో యువత ఆందోళనకు గురవుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తుండడం దారుణమన్నారు.