- మృగశిరలో అందని నీరు
- ఆరుద్ర రాకతో మరింత ఆలస్యం
- ఇప్పుడు నాట్లు వేస్తేనే తుపాన్ల సమయంలో చేతికి వచ్చేది
- శివారులో పునర్వసులోనే నారుమడులు
అమలాపురం : ఆరుద్ర... డెల్టాలో ఏరువాకకు పెద్ద గుదిబండ. ఈ కాలంలో నారుమడులు వేస్తే.. పంట తుపాన్లు సమయంలో చేతికి వచ్చే అవకాశముంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నారువేయడమంటే గాలిలో దీపం పెట్టడమే. అయితే ముందస్తుగా మృగశిర.. లేదా తుపాన్లు దాటిన తరువాత పంట చేతికి వచ్చేలా పునర్వసులో నారుమడులు వేయడం జిల్లాలో డెల్టాలో ఖరీఫ్ రైతులకు పరిపాటి. ఈసారి కూడా మృగశిరలో నీరందించకపోవడంతో ఎప్పటిలానే పునర్వసులో నారువేసేందుకు ఖరీఫ్ రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ఏడాడి కూడా ఖరీఫ్ ఆలస్యం కానుంది.
గోదావరి డెల్టాలో ఖరీఫ్ ఆదునుదాటుతోంది. ముందస్తు ఖరీఫ్‌కు షెడ్యూలుకంటే ముందే నీరంటూ రైతులను ఊరించిన ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలానే సాగునీరు పొలాలకు ఆలస్యంగా విడుదల చేయడంతో సాగులో జాప్యం చోటుచేసుకుంటోంది. జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేసినా..ఆధునికీకరణ, నీరు–చెట్టు అంటూ కాలువలకు అడ్డుకట్టు వేస్తూ 20వ తేదీ వరకు పొలాలకు అందకుండా చేశారు. ఈ కారణంగా డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. తూర్పు, మధ్య డెల్టాల్లో 4.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని అధికారుల లెక్కలు కాగా ఇప్పటి వరకు 60 శాతం పొలాల్లో కూడా నారుమడులు వేయలేదు.
మృగశిర ఈ నెల 21 వరకు ఉన్నా ఆ సమయంలో నీరందక రైతులు నారుమడులు ఆలస్యం చేశారు. 22 నుంచి ఆరుద్ర మొదౖలై జూలై ఏడు వరకూ ఉంది. ఐదు నెలల పంట కాలం కావడం వల్ల ఈ సమయంలో నారు మడులు వేస్తే అక్టోబరు నెలఖారు నుంచి నవంబరు 15 మధ్య చేతికి వచ్చే అవకాశముంది. ఈ సమయంలోనే ఈశాన్య రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురవడం, తరువాత తుపాన్లు కారణంగా పంట నష్టపోవడం డెల్టాలో శివారు రైతులకు పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పునర్వసు మొదలైన తరువాత అంటే జూలై మొదటి వారం తరువాత నారుమడులు వేయనున్నారు. అదే జరిగితే జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారంలో కూడా ఖరీఫ్ నాట్లు వేసే అవకాశం ముంది. ఇదే జరిగితే రబీ ఆలస్యం కావడం, మూడో పంట అపరాలు లేకుండా పోనుంది.
ఎగువున కొంతవేగం...
– తూర్పుడెల్టాలో అనపర్తి సబ్ డివిజన్ పరిధిలో 48 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పుడిప్పుడే నాట్లు ఆరంభించారు. అది కూడా మొత్తం ఆయకట్టులో మూడుశాతమే. ఇక్కడ సుమారు 80 శాతం నారుమడులు పడ్డాయి. బోర్ల వద్ద నారు వేసిన రైతులు మాత్రమే నాట్లు వేస్తున్నారు.
– ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలో 38 వేల ఎకరాలు కాగా, ఇక్కడ కూడా 80 శాతం నారుమడులు పడగా, నాట్లు పది శాతం మాత్రమే అయ్యాయి.
– మధ్య డెల్టాలో కొత్తపేట సబ్ డివిజన్‌లో సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇక్కడ ఆత్రేయపురం మండలంలో మాత్రమే కొంత వరకు నాట్లు పడుతున్నాయి. మొత్తం నియోజకవర్గంలో ఐదు శాతం నాట్లు పడలేదని అంచనా కాగా, కేవలం 30 శాతం మాత్రమే నారుమడులు పడ్డాయి.
శివారులో మరింత ఆలస్యం...
– తూర్పుడెల్టా పరిధిలో రామచంద్రపురం నియోజకవర్గం 58 వేల ఎకరాలు కాగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు. ఇక్కడ జూలై నెలాఖరు, ఆగస్టులో నాట్లు పడే అవకాశముంది.
– సామర్లకోట గోదావరి కాలువ మీద సామర్లకోట మండలంలో 20 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, పది శాతం మాత్రమే నారుమడులు పోశారు.
– కరప, కాకినాడ మండలాల్లో 28,700 ఎకరాలు ఆయకట్టు ఉండగా, ఇక్కడ నాట్లు ఆరంభం కాలేదు. ఇక్కడ సుమారు 40 శాతం ఆయకట్టులో మాత్రమే నారుమడులు వేశారు.
– మధ్యడెల్టాలోని సబ్ డివిజన్ల వారీగా చూస్తే పి.గన్నవరం 14,900 ఎకరాలకుగాను, 70 శాతం, అమలాపురం 42 వేల ఎకరాలకుగాను 30 శాతం, ముమ్మిడివరం 23,500 ఎకరాలకు గాను 25 శాతంచ రాజోలు 17 వేల ఎకరాలకుగాను 10 శాతం కూడా నారుమడులు వేయలేదు. రాజోలు సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు.