మూడు రోజులైనా రాని నీరు
మూడు రోజులైనా రాని నీరు
Published Mon, Mar 27 2017 10:18 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
- ఆర్భాటంగా ప్రకటించిన అధికారులు
- టీడీపీ నేతలకు భయపడడం వల్లే ఈ పరిస్థితని ఆరోపణ
- ఎండుతున్న పొలాల చూసి రైతుల దిగాలు
పిఠాపురం : ఏలేరు ఆయకట్టు పరిధిలో పిఠాపురం సీతారాంపురంలో నీరందక పంటలు ఎండిపోయి కన్నీటి పర్యంతమవుతున్న రైతులను ఆదుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతలకు భయపడి నీరివ్వడానికి వెనుకాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం వల్లే తమ పంటలు ఎండిపోయాయని చేసిన ఆరోపణల పర్యవసానంగా అధికారులు ఆ కాలువల వంక కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పొలాలకు నీరందక రైతులు కన్నీరుమున్నీరవుతున్న వైనాన్ని ‘సాక్షి’ అధికారుల దృష్టికి తెచ్చింది. గత శనివారం ‘అందని నీరు అన్నదాత కన్నీరు’ శీర్షికన వెలువడిన కథనం నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఈ జగదీశ్వరరావు, డీఈ కృష్ణారావు, జేఈలు అప్పారావు, నాగేశ్వరరావు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. నీటిఎద్దడి వల్లే ఎండిపోయినట్టు నిర్ధారించారు. నెలరోజుల పాటు సాగునీరందించడంలో నిర్లక్ష్యం వహించినట్టు గుర్తించిన అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా పంటలు ఎండిపోతుంటే మీరు ఏమి చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే కాలువలకు పొక్లయిన్‌తో మరమ్మతులు చేసి మిగిలిన ప్రాంతాలకు నీటి సరఫరా తగ్గించి రెండురోజుల పాటు పొలాలకు నీరందించాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన నీరు వచ్చే ఏర్పాటు చేసి వీలున్నంత వరకు నష్టం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే అధికారులు పర్యటించి మూడురోజులైనా ఇప్పటికి ఒక్క చుక్క నీరు రాలేదు. కాలువకు మరమ్మతులు చేపట్టలేదు. ఇప్పటికే కొన్ని పంట పొలాలు పనికి రాకుండా ఎండిపోగామూడు రోజుల నుంచి మిగిలిన పొలాలు ఎండిపోతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, ఏలేరు నీటిసంఘం నేతలపై ఆరోపణలు చేయడం వల్లే తమ పొలాలకు నీరివ్వడానికి అధికారులు వెనుకాడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మాపైనే ఆరోపణలు చేస్తారా మీకు నీరెలా వస్తుందో చూస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. దాని వల్లే అధికారులు నీటిసరఫరాపై దృష్టి సారించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.
Advertisement
Advertisement