నీరు కరువాయె.. సాగు బరువాయె..
-
వాడి.. మాడి
-
మురిపించి ముఖం చాటేసిన వరుణుడు
-
∙జిల్లాలో అధ్వానంగా ఖరీఫ్ సాగు ∙25 రోజుల నుంచి కురవని వర్షాలు
-
∙నీటి కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు ∙పలు చోట్ల పశువులకు మేతగా పంటలు
మహబూబాబాద్ : మండలంలో ఈ ఏడాది 1850 హెక్టార్లలో వరి, 352 హెక్టార్లలో మిర్చి, 1075 హెక్టార్లలో మెుక్కజొన్న, 2250 హెక్టార్లలో పెసర, 3050 హెక్టార్లలో పత్తిని సాగు చేశారు. అయితే ప్రారంభంలో కురిసిన వర్షాలు తప్ప.. ఇప్పటివరకు ఆశించిన మేరకు కురవకపోవడం తో పంటలు ఎండిపోతున్నాయి. నీరులేక మాడిపోతున్నాయి. మరో వా రంలోగా వర్షాలు కురవకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
వరి.. హరి
జఫర్‌గఢ్ : వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలోని వరిపొలాలు నెర్రెలు బారుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే ఆశతో మండలంలోని రైతులు బోరు బావుల కింద వరిని విస్తారంగా సాగు చేశారు. అలాగే పత్తి, కంది, మొక్కజొన్న, వేరుశనగ పంటలను కూడా వేశారు. మొదట్లో వర్షాలు మురిపించినప్పటికి క్రమంగా తగ్గిపోయాయి. 20 రోజుల నుంచి చినుకు కూడా లేకపోవడంతో పొలాలు నెర్రలు బారి దుర్భరంగా కనిపిస్తున్నాయి. ఆరుతడి పంటలకు నీరందక మొక్కలు వాడిపోతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో మండలంలో 5,800 ఎకరాల్లో వరి, 16,600 ఎకరాల్లో పత్తి, 1100 ఎకరాల్లో కంది, మొక్కజొన్న 1500 ఎకరాల్లో సాగుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పెట్టుబడి వృథా
రఘునాథపల్లి : నీరు లేక మండలంలో సాగుచేస్తున్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దోరగొల్ల రాజు ప్రభుత్వ సూచన మేరకు ఈ ఏడాది ఒక ఎకరంలో పత్తి, మరో ఎకరంలో కందిని సాగుచేశారు. అలాగే కందిలో అంతరపంటగా పెసర వేశారు. మొదట వర్షాలు బాగా కురవడంతో పెసర పూత బాగా వచ్చిం దని.. కాత దశలోకి చేరుకున్న క్రమంలో వర్షాలు లేక ఎండుముఖం పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెసర, పత్తి పంటలు నీరు లేక పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. పంటల వద్దకు వెళ్లాలంటేనే ఏడుపు వస్తుందని, పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిందని ఆయన పేర్కొన్నారు.
పంట మీద ఆశలు
పోయినయ్..
పాలకుర్తి : మండలంలోని బమ్మెర గ్రామ శివారు దుబ్బతండాకు చెందిన మహిళా రైతు లకావత్ భద్రమ్మ పంటలకు సాగు నీరందించలేక ఆందోళనకు గురవుతోంది. ఈ ఏడాది ఆమె తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేసింది. అయితే 20 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో చేను ఎండిపోతుంది. కంకి తోలేటప్పుడు వానలు లేక పదునుపోతోందని, మొక్కజొన్న కర్రలు, ఆకులు వాడిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. వర్షాల జాడలేకపోవడంతో పంట మీద ఆశలు పోయాయని విలపిస్తోంది. రెండెకరాల పంటను సాగు చేసేందుకు రూ.15 వేల పెట్టుబడి అయిందని ఆమె తెలిపారు.
బోరుమంటున్న బావులు
కేసముద్రం : మండలంలోని కల్వలకు చెందిన తాడబోయిన శ్రీశైలం ఈ ఏడాది తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న, మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని కందిపంటను సాగుచేశారు. మొక్కజొన్నకు రూ.20 వేలు, కంది పంటకు రూ. 30 వేల పెట్టుబడి పెట్టారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగా కురవడం తో మొక్కజొన్న బాగా పెరిగి కంకులు వేసే వరకు వచ్చింది. కంది కూడా మంచి గానే పెరిగింది. ప్రస్తుత నెల నుంచి చినుకు కూడా పడకపోవడంతో రెండు పంటలు ఎండి పోతుం డడంతో ఆందోళనకు గురవుతున్నారు. బావిలో నీరు అడుగంటిపోవడంతో దిగాలు పడుతున్నారు. మరో పది రోజుల్లోగా వర్షాలు పడకుంటే పంటలు చేతికి రావని ఆయన పేర్కొన్నారు.
పశువులకు ఆహారం
కొత్తగూడ : వర్షాభావ పరిస్థితుల కారణంగా కొత్తగూడ ఏజెన్సీ బోరుమంటోంది. గత జూన్, జూలైలో మురి పించిన వర్షాలు ఒక్కసారిగా ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆక్రందనలకు గురవుతున్నారు. మండలంలో ఈ ఏడాది 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 20 వేల ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తున్నారు. అయితే 20 రోజుల నుంచి ఎండలు మండిపోతుండడంతో పంటలు మాడిపోతున్నాయి. బావులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల సాగు నీరు లేక చేతికొచ్చిన పంటలను పశువులకు మేతగా అందిస్తున్నారు.
అన్నదాతల ఆక్రందన
నెల్లికుదురు : మండలంలో సాగు చేస్తున్న పంటలు నీరులేక ఎండిపోతున్నాయి. వర్షాలు కురవకపోవడంతో సాగుకోసం తీసుకొచ్చిన అప్పులు ఎ లా తీర్చాలో తెలియక రైతులు ఆక్రందనలకు గురవుతున్నారు. మండలం లో ఈ ఏడాది వరి 1560, పత్తి 3200, పసుపు 1500, కందులు 360, మెు క్కజొన్న 850 హెక్టార్లలో సాగు చేశారు. అయితే నీరు లేక ఇందులో సగం పంటలు ఇప్పటికే ఎండిపోవడంతో రైతులు విలపిస్తున్నారు.
మేతగా మొక్కజొన్న
దుగ్గొండి : వరుణు డు ముఖం చాటేయడంతో పంటలు పా డవుతున్నాయి. బా వుల్లో నీరు అడుగంటిపోవడంతో సాగు చేస్తున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. మం డలంలో ఈ ఏడాది 6 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అయితే ఆశించిన వర్షాలు లేకపోవడంతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోవడంతో 2 వేల ఎకరాల్లో పంట పాడైపోయింది. నీరు లేక కొంతమంది రైతులు తమ చేలల్లో పశువులు, గొర్రెలను మేపుతున్నారు.