
పేదలందరికీ కల్యాణలక్ష్మి
♦ నారాయణఖేడ్‌కు వెలుగు రావాలి
♦ ఉప ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్
♦ నియోజకవర్గంలో మార్కెట్ యార్డు, ఆసుపత్రి ఉండదా?
♦ఇంతటి వెనుకబాటుతనం ఎక్కడా లేదంటున్నారు
♦ ఇప్పటిదాకా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేశారు?
♦ టీఆర్‌ఎస్‌ను గెలిపించండి.. హైదరాబాద్‌లా అభివృద్ధి చేస్తాం
♦ ఎన్నికల తర్వాత రెండ్రోజులు ఇక్కడే ఉంటా.. పనులు దగ్గరుండి చేయిస్తా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘నియోజకవ ర్గంలో మార్కెట్ యార్డు ఉండదా? ఆసుపత్రులు ఉండవా? ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటయా? ఇంకా ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉండాలా? నారాయణఖేడ్‌కు వెలుతురు రావాలి. కాంగ్రెస్, టీడీపీల సంగతి మీకు తెలియంది కాదు.. పాత చింతకాయ పచ్చడే! ఇయ్యాల రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్‌ఎస్. భూపాల్‌రెడ్డిని గెలిపిస్తే నారాయణఖేడ్ అద్భుతంగా ముందుకు పోతది. అన్ని రకాలుగా నారాయణఖేడ్‌ను అభివృద్ధి చేస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉపఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘వరంగల్, గ్రేటర్ తరహా తీర్పు ఇచ్చే బాధ్యత మీది. నారాయణఖేడ్‌ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసే బాధ్యత నాది..’’ అని చెప్పారు.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నియోజకవర్గ కేంద్రంలో టీఆర్‌ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. వచ్చే బడ్జెట్ నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వర్తింపజేస్తామని చెప్పారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి తీరుతామన్నారు. త్వరలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు. తండాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నందున తమ ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశంలోనే తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తూ ఆర్డర్ పాస్ చేసిందని చెప్పారు. కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఇంత దరిద్రం ఎక్కడ లేదంటున్నరు
నారాయణఖేడ్ మెదక్ జిల్లాలో ఉందా? అని చాలామంది అడుగుతున్నరు. ఇంతటి వెనుకబాటు, దరిద్రం ఎక్కడ లేదని చెప్తున్నరు. ఒకే ఒక్కమాట.. మేధావులు, పెద్దలు ఆలోచన చేయాలి. ఖేడ్‌లో స్వాతంత్య్రం లేదు. కొన్ని చోట్ల ఓట్లు కూడా వేయనీయని పరిస్థితి ఉంది. మాట కూడా మాట్లాడనీయని పరిస్థితి. గూండాగిరి.. దాదాగిరి.. ఎలక్షన్ వచ్చిందంటే డబ్బులు ఇయ్యడం, తాగించడం.. ఇదే పాత చింతకాయ పచ్చడి తప్ప దేశమంతా బాగుపడుతుంటే మనం బాగు పడాలనే సోయి లేదు
హరీశ్ దూసుకుపోయే బుల్లెట్..
అద్భుతమైన మంత్రి మీ జిల్లాలో ఉన్నడు. బుల్లెట్ లాగ దూసుకపోయే తత్వం ఉన్న మని షి. నాలుగైదు నెలల నుంచి మీ మధ్య తిరుగుకుంటూ పనిజేస్తుండు. ఇక్కడ తిరిగి మీ బాధలు చూసి గుండెలు అవిసిపోయి.. ‘మీ కాళ్లు మొక్కుతా..’ అని నన్ను అంటున్నడు. నా కాళ్లు మొక్కే అవసరం లేదు. నేను హరీశ్‌కు, హరీశ్ ద్వారా మీరు గెలిపించబోయే ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి, ఈ నారాయణఖేడ్ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తున్నా. ఇదే హరీశ్ చేత గోదావరి నీళ్లు తెప్పిస్తా. గట్టులింగంపల్లి ప్రాజెక్టు తెచ్చుకొని మీ కాళ్లు కడుగుతా. నారాయణఖేడ్‌కు వెలుతురు రావాలి. కేసీఆర్ మొం డిఘటం.
నేనేదైనా చెప్పితే ఆరు నూరైనా సరే చేసి తీరుతా. ఆనాడు తెలంగాణ కోసం కొట్లాటకు పోతే బక్కపేగులోడు.. వీనితోని ఏమైతది అన్నరు. తెలుగుదేశపోల్లు, కాంగ్రెసోల్లు శానా మాట్లాడిండ్రు. కానీ ఈ బక్కోడే తెలంగాణ తెచ్చిన మాట నిజం. పట్టుదల ఉన్న మంత్రి. హరీశ్ ఒక్కటే మాట మీకు చెప్పిండు. నారాయణఖేడ్‌ను వంద శాతం సిద్దిపేట లాగా చేస్తానని చెప్పిండు. శక్తి ఉన్నోడు.. యువకుడు నాలుగైదు నెలల నుంచి మీ మధ్య తిరుగుతున్నడు. మీ బాధలు జూస్తున్నడు. వందకు వందశాతం హరీశ్ మాట నిలబెడుతా.
రెండ్రోజులు ఇక్కడే ఉంటా..
ఇంకో విషయం మీరు ఆలోచన చేయాలే. అంత గుడ్డిగ ఓటు వేస్తమా? ఇన్ని రోజుల నుంచి ఖేడ్‌లో మార్కెట్ కమిటీ ఉండదా? ఇక మేం సిపాయిలం అంటే మేం సిపాయిలం అంటున్నరు. ఇన్ని రోజులు గెలిచిన ఎమ్మెల్యేలు ఏం జేసిండ్రు. భూపాల్‌రెడ్డిని గెలిపిస్తే ఖేడ్ అద్భుతంగా ముందుకు పోతది. ఎన్నికల తర్వాత ప్రత్యేకంగా రెండ్రోజులు ఖేడ్‌లోనే ఉంటా. నేను వచ్చి అన్ని మండల కేంద్రాలు తిరుగుతా. మీకు కావాల్సిన అభివృద్ధి పనులు స్వయంగా నేనే ఉండి చేయిస్తా.
వెయ్యి ఏనుగుల బలాన్నివ్వండి
నేను కూడా మీ జిల్లా బిడ్డనే. నారాయణఖేడ్ ఇంత వెనుకబడి ఉండటం నాకు కూడా తెలివి ముచ్చట కాదు. నేను ఎక్కడకన్నా పోయి మాట్లాడబోతే.. మీ జిల్లాలో ఖేడ్ సక్కదనం మంచిగ లేదు. ఇక నువ్వు మాకేం చెప్తవు అంటరు. హరీశ్ మీద ఎంత బాధ్యత ఉందో నా మీద కూడా అంతే ఉంది. ఏ పార్టీ గెలిస్తే ఖేడ్ బాగుపడుతదో మేధావి వర్గం ఒక్కసారి ఆలోచన చేయాలే. 20 ఏళ్ల కింద నేను రవాణా మంత్రిగా ఉన్నప్పుడు అందోల్ ఉప ఎన్నికల్లో బాబూమోహన్‌ను గెలిపించడానికి బోయినం. ఈ రోజు హరీశ్ ఎట్లైతే చెప్పిండో.. ఆ రోజు నేను కూడా అలానే చెప్పడం జరిగింది. 20 ఏళ్ల తర్వాత నారాయణఖేడ్ వస్తే మళ్లీ హరీశ్ కూడా అదే చెప్పే పరిస్థితి ఉంది. పశ్చిమ మెదక్ జిల్లాలో పెద్ద ప్రయత్నం జరగాలి. వరంగల్, గ్రేటర్ తరహా తీర్పు ఇచ్చే బాధ్యత మీది. నారాయణఖేడ్‌ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసే బాధ్యత నాది. కారు గుర్తుకు ఓటేసి భూపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి హరీశ్‌కు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వండి.
కేసీఆర్‌కు జన్మదిన కానుకగా ఇస్తాం హరీశ్‌రావు
నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ సీటును గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన కానుకగా ఇస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ నెల 16వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడితే.. 17న కేసీఆర్ పుట్టిన రోజని తెలిపారు. ఈ ఎన్నికలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. రూ.19 కోట్లతో 150 పడకల ఆసుపత్రి మంజూరు చేయించి ఈ ప్రాంత నాయకుల ఇజ్జత్ నిలబెట్టానని తెలిపారు. ‘‘జిల్లా మంత్రిగా నేను మీ మధ్య ఉంటా. నారాయణఖేడ్‌ను దత్తత తీసుకున్నా. ముఖ్యమంత్రి కాళ్లు మొక్కైనా దుబ్బాక తరహా ప్యాకేజీ తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’ అని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో డిప్యూటీ స్పీక ర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, సీహెచ్ మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, పార్టీ నాయకులు దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.