కీలక శాఖలే దక్కాయి
Published Tue, Apr 4 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్‌కు కీలక శాఖలే దక్కాయి. మంత్రి పితానికి కార్మిక , ఉపాధి, శిక్షణ, పరిశ్రమల శాఖ కేటాయించగా, మరో మంత్రి కేఎస్ జవహర్‌కు ఎక్సైజ్ శాఖ దక్కింది. మొదటిసారి మంత్రి అయిన కేఎస్ జవహర్‌కు కీలకమైన శాఖను కేటాయించారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు శాఖలో ఎటువంటి మార్పు చేయలేదు. అయనకు తిరిగి దేవాదాయ శాఖ దక్కింది. ఇదిలావుంటే, టీడీపీలో ఏర్పడిన అసమ్మతి ఇంకా చాపకింద నీరులానే ఉంది. రాజీమానా అస్త్రం సంధించిన చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత మనసు మార్చుకున్నారు. విధేయతతో పనిచేస్తానంటూ పత్రికలకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పితాని సత్యనారాయణను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై పార్టీలో ఇప్పటివరకూ చక్రం తిప్పిన ఓ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ అప్పట్లో తెలుగుదేశం నాయకులపై కేసులు పెట్టించడంతోపాటు వారిని అణచివేయడానికి చూశారని ఆ వర్గం ఆరోపిస్తోంది. అయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా నేరుగా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం విదితమే. సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరును, అతనిని ముఖ్య మంత్రి ప్రోత్సహిస్తున్న వైనాన్ని పలుమార్లు బహిరంగంగానే పితాని తప్పు పట్టారు. ఇప్పుడు ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోవడం, జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ఆయనకు పట్టు ఉండటంతో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కదనే భావన టీడీపీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద కూడా ప్రస్తావించినట్టు సమాచారం. బీసీలకే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే అంగర రామ్మోహన్‌కు ఇవ్వాల్సిందని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఎందుకు ఇచ్చారంటూ వారు ముఖ్యమంత్రి వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి జోక్యంతో అసమ్మతి తాత్కాలికంగా చల్లారినట్టు కనిపిస్తున్నా భవిష్యత్‌లో జిల్లా నేతలు రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంది.
Advertisement
Advertisement