చేనేతను నిర్వీర్యం చేశారు
ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపాటు
– 30న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్మవరంలో చేనేత ధర్నా
ధర్మవరం టౌన్ : పెరిగిన ముడి సరుకు ధరలతో చేనేతల నష్టాల పాలై దుర్భర పరిస్థితులను అనుభవిస్తుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. ముడిపట్టు రాయితీ బకాయిని వెంటనే విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈనెల 30న ధర్మవరం సెరికల్చర్ కార్యాలయం ఎదురుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేనేత ధర్నాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 32 నెలల కాలంలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ప్రధానంగా ముడిపట్టు రాయితీ, చేనేత ఆరోగ్యబీమా, ఆర్టిసాన్ క్రెడిట్ ద్వారా రాయితీ రుణాలు, ఎన్‌హెచ్‌డీసీ తదితర పథకాలను నిర్వీర్యం చేసి, చేనేతలకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. చేనేత సంక్షోభానికి పెరిగిన ముడిపట్టు ధరలే కారణమని, ముడిపట్టు గతంలో కిలో రూ.2 వేలు ఉంటే ప్రస్తుతం రూ.4 వేలుకు చేరుకుందన్నారు. దీంతో చేనేత కార్మికులకు రోజు కూలీ రావడం కూడా కష్టమైందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేనేత ముడిపట్టు రాయితీ పథకాన్ని కూడా అటకెక్కించిందన్నారు. ఫలితంగా నేతన్నలకు 15 నెలల ముడిపట్టు రాయితీ పెండింగ్‌లో ఉందన్నారు.
రాయితీని రూ.1000కి పెంచుతామని టీడీపీ ప్రభుత్వం మరో నాటకానికి తెరలేపిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినతర్వాత కేవలం 17 నెలలు మాత్రమే రాయితీని పంపిణీ చేసిందన్నారు. అదీ కూడా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తాము గతేడాది జూలై నెలలో సంతకాల సేకరణ చేపట్టి, జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేసిన ఫలితమేనన్నారు. గత ఏడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు ధర్మవరంలో చేనేతల సమావేశం నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తామని, రాయితీని వెయ్యికి పెంచుతున్నామని హామీ ఇచ్చి వెళ్లిపోయారన్నారు. సీఎం హామీ ఇచ్చి ఐదు నెలలైనా అమలు కాకపోవడం దారుణమన్నారు.
చేనేతలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ససీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ చేనేత ధర్నాకు మద్దతు తెలిపిన అఖిల పక్ష పార్టీలకు , అన్ని చేనేత సంఘాల నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చేనేత ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని చేనేతలకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు కుమారస్వామి, కంబగిరి, పాలబావి శ్రీన, తేజ, శివశంకర్, కడపల రంగస్వామి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.