'బాబు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలవా?'
హైదరాబాద్: పోలవరం విషయంలో తెలంగాణను ప్రశ్నించే పరిస్థితి కూడా ఏపీ ప్రభుత్వానికి లేకుండా పోయిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు.
'1650 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని ఓవైపు చెబుతారు. 8 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లామని మరోవైపు చెబుతారు. వరద నీళ్ల స్టోరేజి కోసమే పోలవరం కడుతున్నారు. అందుకే దాన్ని పోలవరం అంటారు. ఆ నీళ్లు నిల్వ చేసుకుంటే, తర్వాత నీళ్లు డైవర్ట్ చేయగలిగితే కృష్ణాకైనా, శ్రీశైలానికైనా ఇవ్వచ్చు. కానీ మీ పట్టిసీమలో స్టోరేజి అనేది లేదు. అదే మీరు చేస్తున్న అన్యాయం. పట్టిసీమ కోసం పోలవరం ప్రాజెక్టును కాంప్రమైజ్ చేస్తారు. చివరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు' అని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
మరోవైపు చేనేత కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ చేనేత కార్మికులెవరికీ రుణాలు మాఫీ కాలేదని, సబ్సిడీలు అందడం లేదని అన్నారు. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద రంగం చేనేత కార్మిక రంగమే అనే గుర్తు చేశారు. కానీ, వారి పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దయనీయంగా మారిందని చెప్పారు.
రూ.110 కోట్లు చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామంటున్నారని కానీ ఎక్కడా మాఫీ కాలేదని అన్నారు. ధర్మవరంలో 12మంది కార్మికులు చనిపోతే వాళ్లింటికి వెళ్లి బాధలు విన్నామని చెప్పారు. చేనేత కార్మికులంతా విలవిల్లాడుతుంటే, 22 వేలమందికి మాత్రమే రుణమాఫీ చేశాం, అంతటితో అయిపోయిందంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణ పరిస్థితికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు వైస్ జగన్ చెప్పారు.