ఖైరతాబాద్ లడ్డూ తయారీకి శ్రీకారం
ఖైరతాబాద్ లడ్డూ తయారీకి శ్రీకారం
Published Sun, Aug 14 2016 10:21 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
తాపేశ్వరం (మండపేట) :
వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథునికి 500 కిలోల లడ్డూను కానుకగా అందించేందుకు తాపేశ్వరంలోని సురుచిఫుడ్స్ సంస్థ ఏర్పాట్లలో నిమగ్నమైంది. అందులో భాగంగా లడ్డూ తయారీ కోసం సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు దంపతులు ఆదివారం పందిరి ఏర్పాటుకు రాటముహూర్తం చేశారు. 2010వ సంవత్సరంలో ఖైరతాబాద్ గణనాథునికి 500 కిలోల లడ్డూను కానుకగా అందజేసిన సురుచి ఫుడ్స్ సంస్థ అప్పటి నుంచి ఏయేటికాయేడు లడ్డూ పరిమాణాన్ని పెంచుతూ ఖైరతాబాద్ గణనాథునికి లడ్డూను కానుకగా అందజేస్తోంది. 2011లో 2400 కిలోల లడ్డూ తయారు చేయగా, 2012లో 3,500 కిలోల లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోలు, 2015లో 6,000 కిలోల లడ్డూను స్వామివారికి అందజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా లడ్డూను కానుకగా స్వీకరించడంపై అక్కడి నేతల నుంచి వస్తున్న అభ్యంతరాలు, ప్రసాదం పంపిణీ వివాదస్పదమవుతుండటంతో ఈ ఏడాది లడ్డూ కానుక స్వీకరణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది లడ్డూను కానుకగా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వారే సొంతంగా తయారుచేసుకోవాలని భావిస్తే అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని ఉత్సవ కమిటీకి మల్లిబాబు తెలిపారు. 500 కిలోల లడ్డూ తయారు చేసి ఇవ్వాలన్న ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కోరిక మేరకు లడ్డూ తయారీ చేపడుతున్నట్టు మల్లిబాబు తెలిపారు. ఏటా మాదిరి పందిరి ఏర్పాటు కోసం సురుచి సంస్థ ఆవరణలో మల్లిబాబు, భారతి దంపతులు రాటముహూర్తం చేశారు.
Advertisement
Advertisement