పండుగ పూట పైసలు ఖతమ్!
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో రాజ్‌కుమార్ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ‘దసరా’ హడావుడి వల్ల తీరిక లేకపోవడంతో పండుగకు ముందు రోజు బుధవారం (21వ తేదీ) సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి షాపింగ్‌కు వెళదామని అనుకున్నాడు. అయితే బుధవారం ఉదయం విధుల్లో ఉన్న రాజ్‌కుమార్‌కు.. ఎస్‌బీహెచ్ సిబ్బంది అంటూ హిందీలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మీ ఏటీఎం కార్డు రెన్యువల్ డేట్ అయిపోతోంది. మరో రెండు నిమిషాల్లో మీ ఖాతా నుంచి లావాదేవీలు నిలిచిపోతాయి. మీ కార్డు వివరాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలి. మీ ఏటీఎం కార్డు మీద ఉన్న 16 డిజిట్ నంబర్లు చెప్పండి’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి కోరాడు.
పండుగ పూట ఇదేం గోల.. ఒకవేళ నిజంగా ఖాతా నిలిచిపోతే మొదటికే మోసం వస్తుందని భావించిన రాజ్‌కుమార్ ఆ నంబర్లు చెప్పేశాడు. ఆ తర్వాత వారి మాటలను నమ్మి సీవీవీ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ కూడా ఇచ్చేశాడు. ‘మీ సెల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) వస్తుంది. తిరిగి వెంటనే కాల్ చేస్తా’ అని ఫోన్ పెట్టేశాడు. కాల్ కట్ అయ్యిందో లేదో ఓటీపీ వచ్చింది. మళ్లీ కాల్ చేసి ఓటీపీ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది క్షణాలకే ‘మీరు రూ.47 వేలు ఆన్‌లైన్ షాపింగ్ చేశారు’ అంటూ ఎస్‌ఎంఎస్ వచ్చింది. దీంతో రాజ్‌కుమార్ లబోదిబోమన్నాడు. అతని కుటుంబానికి పండుగ సంబురం లేకుండా పోయింది.
ఈ నెల 21న రాజ్‌కుమార్‌కు ఫోన్ కాల్ వస్తే.. అదే డిపోకు చెందిన మరో ముగ్గురు లక్ష్మీ శేఖర్(రూ.28 వేలు), తిరుపతిరావు(రూ.10 వేలు), ఎస్‌ఏ చారి(రూ. 5,500)లకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ 23, 24 తేదీల్లో రావడంతో మోసమని గుర్తించిన నలుగురూ సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇదే డిపోకు చెందిన మరో ముగ్గురు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు తెలుస్తోంది. వీరంతా కలసి సుమారు రూ. లక్ష వరకూ మోసపోయినట్టు సమాచారం.
30 మందికి కాల్స్..
ఇదే డిపోకు చెందిన దాదాపు 30 మందికి ఫోన్ కాల్స్ వచ్చినట్టు సమాచారం. అయితే కొంతమంది అప్రమత్తమై ఎటువంటి వివరాలు ఇవ్వకపోగా.. మరికొంత మంది సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి పూర్తి వివరాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే నలుగురిలో చులకనవుతామనే ఉద్దేశంతో కొంత మంది ముందుకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. కాగా, ఆర్టీసీ డిపో సిబ్బంది వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కడంపై సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది బిహార్, జార్ఖండ్ ముఠాల పనిగా అనుమానిస్తున్నారు.
మోసపోకండి..
క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు అప్‌డేట్ చేస్తామంటూ ఫోన్లు వచ్చినా, తక్కువ వడ్డీకే రుణం ఇస్తామంటూ ఈ-మెయిల్స్ వచ్చినా, ఏటీఎం కార్డు వెరిఫికేషన్ కోసం ఆధార్‌తో అనుసంధానం చేస్తామన్నా, షాపింగ్ చేయడం వల్ల వచ్చే రివార్డు పాయింట్లను ఖాతాలకు బదిలీ చేస్తామన్నా, క్రెడిట్ ఫెసిలిటీ రూ.50 వేల వరకు ఉంటే దాన్ని రూ. లక్ష వరకు పెంచుతామని.. వచ్చే కాల్స్ నిజమైనవి కావని, ఇటువంటి ఫోన్ కాల్స్‌ను నమ్మి ప్రజలు మోసపోవద్దని సైబరాబాద్ సైబర్ విభాగం ఏసీపీ జయరాం కోరారు.