లక్ష ఇస్తేనే బతుకుతా.. | Kidney victim forced with her father | Sakshi
Sakshi News home page

లక్ష ఇస్తేనే బతుకుతా..

Published Sat, Jan 9 2016 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

లక్ష ఇస్తేనే బతుకుతా..

లక్ష ఇస్తేనే బతుకుతా..

‘నాన్నా.. నేను ఇక బతకలేను.. మీకు నేను కావాలనుకుంటే రూ.లక్ష నా బ్యాంకు ఖాతాలో వేయండి. ఎంత త్వరగా డిపాజిట్ చేస్తే అంత మంచిది....లేకుంటే ఇక మీరు నన్ను  చూడలేరు’’  అంటూ  దమ్మపేట మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన మువ్వా నరేష్‌కుమార్  మాట్లాడలేని స్థితిలో తండ్రి సుబ్బారావుకు ఫోన్ చేశాడు.  ఎకరం న్నర భూమిలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించే తండ్రికి ఏం చేయాలో పాలుపోలేదు. కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలనే తాపత్రయంతో బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్ చేశాడు. తిరిగి రెండ్రోజుల తర్వాత మరో రూ.3 లక్షలు కావాలని కొడుకు ఫోన్ చేశాడు. తీగ లాగితే... కిడ్నీ రాకెట్ డొంక కదిలింది.
 
* డబ్బు పంపాలని తండ్రికి కిడ్నీ బాధితుడి ఫోన్
* మూడు రోజుల తర్వాత రూ. 3 లక్షలు పంపమన్న కొడుకు
* అనుమానంతో పోలీసులను ఆశ్రయించిన తండ్రి
* వెలుగుచూసిన కిడ్నీ రాకెట్


సాక్షిప్రతినిధి, ఖమ్మం / అశ్వారావుపేట: మరో రూ.3 లక్షలు కావాలని.. లేకుంటే నేను చనిపోతానని చెప్పడంతో అనుమానం వచ్చిన తండ్రి దమ్మపేట పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేయకున్నా.. మానవతాదృక్పథంతో నరేష్ ఉంటున్న ప్రాంతాన్ని సెల్ టవర్ ఆధారంగా గుర్తించిన పోలీసులు తండ్రికి సమాచారం అందించడంతో విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలో ఉన్న నరేష్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చాక నరేష్ ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతోపాటు పొట్టపై కోసినట్లు గాయం ఉంది.

దీంతో  ఈనెల 7న సత్తుపల్లిలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో పరీక్ష చేయించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు ఒక కిడ్నీ లేదని చెప్పాడు.  నరేష్ ఏమీ మాట్లాడలేక పోవడంతో దమ్మపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడికి అన్యాయం జరిగిందంటూ తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయమే అశ్వారావుపేట సీఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు నరేష్‌కుమార్, అతని తండ్రి సుబ్బారావును సత్తుపల్లి డీఎస్పీ కవిత ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం  నల్లగొండ జిల్లాలో ఇలాంటి కేసే నమోదు కావడంతో, మరింత సమాచారం కోసం న ల్లగొండ జిల్లాకు తీసుకువెళ్లారు.
 
అంతుపట్టని  సందేహాలు..
దమ్మపేట మండలం నాయుడుపేట గ్రామంలో ఎవరితో వివాదాలు లేకుండా కేవలం చదువు మీద మాత్రమే దృష్టి పెట్టే నరేష్‌కుమార్ కిడ్నీ రాకెట్‌లో ఇరుక్కున్నాడని తెలియడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. ఈనెల 4న తండ్రి జమచేసిన రూ.లక్ష ప్రకాశం జిల్లాకు చెందిన బీఎన్ రెడ్డి అనే వ్యక్తి ఖాతాకు బదిలీ  చేయడంతోపాటు గతంలో కూడా ఇదే ఖాతాకు నరేష్ ఖాతా నుంచి డబ్బులు బదిలీ అవటానికి కారణాలు అర్థం కావడంలేదు. దీనికి తోడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తండ్రి పంపిన లక్ష రూపాయలతో క్రికెట్ బెట్టింగ్ ఆడితే.. రూ. 5లక్షలు వస్తాయని.. తద్వారా తన కిడ్నీ తనకు ఇస్తారని నరేష్‌ను మోసగాళ్లు నమ్మించారని.. దీంతో నరేష్ తన వద్ద ఉన్న లక్షను బెట్టింగ్‌లో ఉంచినట్లు  తండ్రి దమ్మపేట పోలీసులతో చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ తన కిడ్నీని గతడాది నవంబర్‌లో తొలగిస్తే.. ఈనెల 2వరకు కొలంబో, చెన్నై, విజయవాడలో పోలీసులను ఎందుకు ఆశ్రయించలేక పోయాడనే అంశాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. కొలంబోలో విమానం ఎక్కించిన తర్వాత చెన్నైలో రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పనిచేయడానికి ఆస్పత్రి యాజమాన్యం ఎలా అనుమతించిందనేది అంతుపట్టని విషయం. ఉన్నట్లుండి తనను మోసం చేసిన బ్రోకర్ చెన్నై మహానగరంలో తారసపడటం.. రెండోసారి మోసపోవడం.. తండ్రి నుంచి డబ్బులు రప్పించి బెట్టింగ్ ఆడటం... మళ్లీ డబ్బులు కావాలని ఫోన్‌చేయడంతో తండ్రి కుమారుడి ఆచూకీ కనిపెట్టాడే తప్ప నరేష్ తనకు తానుగా ఇంటికి రాకపోవడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఓ పోలీస్ ఉన్నతాధికారిని సంప్రదించగా.. కిడ్నీ అపహరణకు గురైందా..?. అమ్మకం జరిగిందా అనే కోణంలో పూర్తి దర్యాప్తు జరుగుతుందన్నారు. ఏదేమైనా పోలీసుల విచారణ నాయుడు పేట నుంచి కొలంబో వరకు జరిగితేనే అన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈవిషయమై సత్తుపల్లి డీఎస్సీ కవితను సంప్రదించగా కేసుకు సంబంధించిన అన్ని విషయాలను అశ్వారావుపేట సీఐ రవికుమార్ పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఆయనను సంప్రదించగా నరేష్ ఏమీ మాట్లాడటం లేదని.. ప్రస్తుతానికి కావలసిన వివరాలను కాగితంపై రాసి ఇస్తున్నాడని.. విచారణ ప్రాథమిక దశలోనే ఉందన్నారు.
 
కిడ్నీ రాకెట్‌ను ఛేదించేందుకు రంగంలోకి టాస్క్‌ఫోర్స్
మువ్వా నరేశ్‌కుమార్‌ను నల్లగొండ పోలీసులు కూడా విచారించారు. రెండు జిల్లాల్లోనూ కిడ్నీ రాకెట్ ఉదంతాలు వెలుగుచూడడంతో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.  హైదరాబాద్ నుంచి వచ్చిన  పోలీసులు నల్లగొండ జైలులో ఉన్న నలుగురు నిందితులను కలిసి కొన్ని వివరాలు సేకరించి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక, ఈ కిడ్నీ రాకెట్‌లో పాత్రధారులైన వారందరి వివరాల ఆధారంగా వారిని పట్టుకునేందుకు కూడా నల్లగొండ జిల్లా పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
 
ఎలాగైనా రాకెట్ ఛేదించండి: నల్లగొండ ఎస్పీ ఆదేశాలు
ఇక, ఈ కిడ్నీ రాకెట్ విషయంలో నల్లగొండ ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్  సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న అందరి నిగ్గూ తేల్చాల్సిందేనని, పకడ్బందీగా దర్యాప్తు చేయాలని జిల్లా పోలీసులకు ఆదేశాలిచ్చారు. మరోవైపు ఈ రాకెట్‌ను ఛేదించేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోనికి దిగారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బందం గురువారమే నల్లగొండకు వచ్చి విచారణ చేసినట్టు తెలుస్తోంది.

వీరు జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా కలిసి వివరాలు తెలుసుకుని వెళ్లారని పోలీసు వర్గాల సమాచారం. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ కిడ్నీ లింకులను తెలుసుకునేందుకు కూడా నల్లగొండ, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లారని తెలుస్తోంది. ఈ రాకెట్ ద్వారా కిడ్నీలు అమ్ముకుని వారందరినీ తీసుకువస్తే అన్ని విషయాలు కూలంకషంగా వెలుగులోకి వస్తాయనే ఆలోచనతో పోలీసులున్నట్టు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement