కొనసాగిన కోట్లాట
కొనసాగిన కోట్లాట
Published Tue, Jan 17 2017 1:28 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : ప్రభుత్వ యంత్రాంగం ఓడిపోయింది. కోడి పందేలతోపాటు జూద క్రీడలను ముందుండి మరీ గెలిపించింది. జూదరుల సొమ్ములను కరిగించేసి.. పందేల నిర్వాహకులకు సిరుల వర్షం కురిపించింది. రాజకీయ క్రీడలో.. అధికార పార్టీ నేతలు అండదండలు అందించడంతో ప్రభుత్వం నుంచి ‘చూసీచూడనట్టు వెళ్లండి’ అంటూ మౌఖిక ఆదేశాలు వెలువడటంతో జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ టీమ్‌లు అడ్రస్ లేకుండా పోయాయి. మూడు రోజుల పండగ అయినా బోనస్‌గా నాలుగో రోజున కూడా పందేలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చి పోలీసులు తమ ఉదారత చాటుకున్నారు. దీంతో సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, పేకాట, ఇతర జూద క్రీడలు యథేచ్ఛగా సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారగా.. సందట్లో సడేమియా అన్నట్టుగా రూ.2 వేల నకిలీ నోట్లనూ చలామణి చేయడం కలకలం సృష్టించింది. అకివీడు మండలం ఐ.బీమవరం జూద శిబిరంలో పెద్దఎత్తున రూ.2 వేల నకిలీ నోట్లు చలామణి అయ్యాయి. దీనిని గుర్తించిన నిర్వాహకులు ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పంపించి వేశారు. కొన్ని దొంగనోట్లను చించివేశారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. కోడిపందేల మాటున జూద క్రీడలు, పేకాట పెద్దఎత్తున సాగినా ఖాకీలు మిన్నకుండటం విమర్శలకు తావిచ్చింది. అంతా అయిపోయాక పందేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీలు పనిచేయలేదు. ఈ నెపాన్ని కిందిస్థాయి సిబ్బందిపై నెడతారా, వారికి నోటీసులు ఇస్తారా లేక ఉన్నతాధికారులు బాధ్యత వహిస్తారా అనేది వేచి చూడాల్సిందే. కోర్టుకు చూపడం కోసం నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 330 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
అన్నిచోట్లా ఆడించారు
ప్రధానంగా భీమవరం మండలం వెంప, వీరవాసరం మండలం కొణితివాడ, భీమడోలు మండలం గుండుగొలను, పెదవేగి మండలం కొప్పాకలో భారీస్థాయి పందేలు నిర్వహించగా, భీమవరం మండలం తోకతిప్ప, ఈలంపూడి, దిరుసుమర్రు, చినఅమిరం, రాయలం, యనమదుర్రు, లోసరి, దెయ్యాలతిప్ప, వీరవాసరం, అండలూరు, నందమూరుగరువు, మత్య్సపురి, నవుడూరు, ఉత్తరపాలెం, వడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఒక మోస్తరు పందేలు జరిగాయి. నరసాపురం నియోజకవర్గంలో సోమవారం కూడా కోడిపందేలు, గుండాట, పేకాట విచ్చలవిడిగా సాగాయి. మొగల్తూరు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో గుండాట, కోడి పందేలను రేయింబవళ్లు నిర్వహించారు. రామన్నపాలెం, తూర్పుతాళ్లు గ్రామాల్లోని శిబిరాలపై పోలీసులు సోమవారం పోలీసులు దాడులు చేశారు. లిఖితపూడి, రాజుల్లంక, వేములదీవి, లక్ష్మణేశ్వరం, రుస్తుంబాద, తూర్పుతాళ్లు, మత్స్యపురి, యర్రంశెట్టివారిపాలెం పందేలు యథావిదిగా జరిగాయి. పాలకొల్లు మండలం పూలపల్లి ప్రధాన బరులు కోలాహలంగా మారింది. దగ్గులూరు, తిల్లపూడి, చింతపర్రు, భగ్గేశ్వరం, వడ్లవానిపాలెం, గొల్లవానిచెరువులో జూద క్రీడలు అడ్డూఅదుపు లేకుండా సాగాయి. యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో ఎట్టి పరిస్థితితుల్లోను కోడి పందాలను ఆపాలని అధికార పార్టీ నాయకుల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో సోమవారం ఉదయం పోలీసులు, గ్రామస్తులు మధ్య రెండు గంటలపాటు హైడ్రామా నడిచింది. భీమడోలు మండలం గుండుగొలను, కురెళ్లగూడెం, పోలసానిపల్లి, సూరప్పగూడెం, అంబర్‌పేట తదితర గ్రామాల్లో పందేలు భారీ ఎత్తున జరిగాయి. నిడమర్రు మండలం పత్తేపురంలోని పెద్ద బరితోపాటు రెండు చిన్నబరుల్లోనూ పందెంకోళ్లు కత్తులు దూశాయి. కాళ్ల మండలం సీసలి, జక్కరం, పెదఅమిరం, మాలవానితిప్ప, ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం, కొమడవోలు, జాలిపూడి, శ్రీపర్రు గ్రామాల్లో పందేలు, పేకాట శిబిరాలు జోరుగా సాగాయి. కాట్లంపూడి, మాదేపల్లి శివారు ప్రాంతాల్లోని చేపల చెరువులు, పంటభూముల మధ్య చెట్ల కింద కొత్తగా పేకాట స్థావరాలు నడిచాయి. జంగారెడ్డిగూడెం, సుబ్బంపేట రోడ్డు, శ్రీనివాసపురం, లక్కవరం, దేవులపల్లి, పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో పందేలు, జూదాలు జోరుగా నిర్వహించారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం, బయ్యనగూడెం, దిప్పకాయలపాడు, పరింపూడి గ్రామాల్లోనూ కొనసాగాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు నిర్వహించే బరుల్లో సోమవారం పందేలు వేయగా, మిగిలిన చోట్ల నిలిచిపోయాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ధర్మాజీగూడెం, కలరాయనగూడెం, ములగలంపాడు గ్రామాల్లోని ఆయిల్‌పామ్, మామిడి తోటల్లో నిర్వహించిన పందేలకు కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచి పందెగాళ్లు తరలివచ్చారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లోనూ పలుచోట్ల పందేలు కొనసాగాయి.
Advertisement
Advertisement