భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం తొలగించండి
వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
రాజమహేంద్రవరం కల్చరల్ : కోరుకొండ గ్రామంలో రైతుల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లపై నిషేధం తొలగించాలని వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరారు. ఆమె సోమవారం కోరుకొండ గ్రామానికి చెందిన 30 మంది రైతులతో దేవాదాయశాఖ ప్రాంతీయ సహ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను ఆయన కార్యాలయంలో ప్రాంతీయ కలసి రిజిస్ట్రేషన్లు ఆపివేయడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అన్నవరం దేవస్థానం నుంచి ఈ భూములు దేవస్థానానికి చెందినవని తమకు లేఖ రావడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేశామని, ఈ భూములు దేవస్థానానికి చెందినవని సంబంధిత తహసీల్దార్ ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇచ్చారని అధికారులు చెబుతున్నారన్నారు. సమాచారహక్కు చట్టం కింద ఈ విషయంలో రైతులు తహసీల్దార్ నుంచి వివరాలు అడిగినప్పుడు తాము ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేదని సమాధానం వచ్చిందని ఆమె ప్రాంతీయ సహ కమిషనర్‌కు తెలిపారు. సహేతుక కారణం లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేసి, ఈ ఏడాది జనవరిలో ఈ భూములను నిషిద్ధ భూములుగా ప్రభుత్వం ప్రకటించడం చట్టవిరుద్ధమని ఆమె తెలిపారు. రైతుల జీవితాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.