రిజిస్ట్రేషన్లు చేయకపోతే ఆందోళన ఉధృతం
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
కోరుకొండ (రాజానగరం) : భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని పార్టీలకు అతీతంగా కోరుకొండలో రైతులు, ప్రజలు ఐదు రోజులుగా చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. గ్రామంలో ఆదివారం దీక్షాధారులకు డ్రింక్ ఇచ్చి ఆమె దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నవరం దేవస్థానం ఈఓ వైఖరి వల్ల రెండున్నర ఏళ్లుగా పొలాలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు క్రయ విక్రయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు రైతులతో కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. అప్పటికీ స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాల నాయకులు బొరుసు బద్రి, వుల్లి ఘణనాథ్, కాలచర్ల శివాజీ, సలాది వెంకటేశ్వరరావు, అయిల శ్రీను, వాకా నరసింహరావు, గట్టి ప్రసాద్, తోరాటి సత్య ప్రసాద్, ముద్దాల అను, వుల్లి శేషగిరి, అయిల రామకృష్ణ, గుగ్గిలం బాను తదితరులు పాల్గొన్నారు.