నృత్యద్భుతం..
-
∙510 మంది నర్తకీమణుల కూచిపూడి నాట్యఝరి
-
∙అలరించిన అన్నమయ్య పద నృత్యాంజలి
రాజమహేంద్రవరం కల్చరల్ :
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 510 మంది కళాకారులు అన్నమయ్య కీర్తనలకు కూచిపూడి నృత్యాభినయంతో ‘శ్రీవేంకటేశ్వర’’ ఆనం కళాకేంద్రం ప్రతిధ్వనించింది. రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ సహకారంతో భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, లయ¯Œ్స క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ట్స్, కల్చరల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అన్నమాచార్య పదనృత్యాంజలి కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూచిపూడి నర్తకీమణులు తరలివచ్చారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జ్యోతిప్రజ్వలన చేశారు. కూచిపూడి నాట్యం మన సంపదని దానిని కాపాడుకోవాలన్నారు. ఎంపీ మురళీమోహ¯ŒS మాట్లాడుతూ కూచిపూడి తెలుగువారి నాట్యమని పేర్కొన్నారు.
ఎన్నో కీర్తనలు..మరెన్నో హావభావాలు
ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుల శిష్యబృందం ప్రదర్శించిన రంగపూజతో నృత్యంజలి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ‘అదిగో, అల్లదిగో’, ‘వాడలవాడలా’, ‘వేదములే నీ నివాసములటా’, ‘బ్రహ్మ కడిగిన పాదము’, ‘అతనెవ్వడు చెప్పరే అమ్మలాలా’, ‘బ్రహ్మమొకటే’.. ఇలా ఎన్నో కీర్తనలకు నర్తకీమణులు అడుగులు వేస్తూ అలరించారు.
ప్రముఖులకు జీవితసాఫల్య పురస్కారాలు
కూచిపూడి గ్రామానికి చెందిన నాట్యగురు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత , 93 వసంతాల చింతా సీతారామాంజనేయులు, నగరానికి చెందిన సంగీత, సామాజిక సేవావేత్త, 99 వసంతాల జోస్యుల సూర్యనారాయణలు జీవిత సాఫల్యపురస్కారాలను అందుకున్నారు. భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఈ పురస్కారాలను అందజేశారు.