క్లబ్బు..గబ్బు
ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగుల రిఫ్రెష్‌మెంటు కోసం కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ (కర్నూలు క్లబ్) ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మారిపోయిందన్న చర్చ జోరుగా సాగుతోంది.
- నాయకుల చేతుల్లో కర్నూలు క్లబ్!
- సేవలకు స్వస్తి... పేకాటతో కుస్తీ
కర్నూలు: ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగుల రిఫ్రెష్‌మెంటు కోసం కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ (కర్నూలు క్లబ్) ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మారిపోయిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఐదు దశాబ్దాల క్రితం పది ఎకరాల ప్రభుత్వ స్థలంలో సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటైన ఈ క్లబ్.. ప్రస్తుతం వ్యాపార కేంద్రంగా మారిపోయిందని స్వయంగా సభ్యులే ఆరోపిస్తున్నారు. గతంలో ఇందులో మెజార్టీ సభ్యులు, ఆఫీసర్లు ఉండేవారు. క్లబ్ నిధులను పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాల కోసం వినియోగించేవారు. కొంతకాలంగా రాజకీయ నాయకుల పెత్తనంలోకి క్లబ్ వెళ్లిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సేవలకు స్వస్తి చెప్పి.. పేకాటతోనే దినసరి కార్యక్రమాలు ప్రారంభమతువున్నాయి. రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు యథేచ్ఛగా పేకాట కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. బైలాన్ మార్పు చేసి అధికారులను పక్కనపెట్టి నేతలకు పట్టం కట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోజుకు రూ.10 లక్షలకుపైగా టర్నోవర్..
కర్నూలు క్లబ్‌కు కోట్లాది రూపాయలు నిధులున్నాయి. వాటిని సేవా కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంది. ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్‌లతో పాటు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలని గతంలో జనరల్‌బాడీ సమావేశంలో నిర్ణయం చేసినప్పటికీ అటువైపుగా కార్యక్రమాలు జరగడం లేదు. క్లబ్ ప్రారంభంలో రూ.5వేలు సభ్యత్వం ఉండేది. ప్రస్తుతం రూ.50వేల వరకు ఒక్కొక్కరి నుంచి సభ్యత్వ రుసుం పేరుతో వసూలు చేస్తున్నారు.
డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో వివిధ సేవా కార్యక్రమాలు జరిపే వారు. సభ్యులు, కుటుంబ సమేతంగా ఆయా కార్యక్రమాలకు హాజరయ్యే వారు. అయితే కొంతకాలంగా కేవలం పేకాట మినహా మిగతా కార్యక్రమాలు చేపట్టకపోవడంతో మహిళలు వినోద కార్యక్రమాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. పేకాట రూపేనా రోజుకు లక్ష రూపాయలకుపైగా ఆదాయం సమకూరుతున్నట్లు సమాచారం. ఆఫీసర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు గతంలో రిఫ్రెష్‌మెంట్ కోసం క్లబ్‌కు వచ్చే వారు. అయితే జనరల్‌బాడీ నిర్ణయాలను మార్పు చేసి ప్రైవేట్ వ్యక్తులు కూడా అందులో సభ్యులుగా చేరిపోవడంతో పేకాట జోరుగా సాగుతోంది. క్లబ్‌కు సంబంధించిన నిధులను కొంతమంది వడ్డీలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది.
జోరుగా మద్యం విక్రయాలు..
కర్నూలు క్లబ్‌లో అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో సభ్యుల కోసమే ఇక్కడ బార్ ఏర్పాటుచేశారు. వ్యాపారం పెంచుకోవడం కోసం బార్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. దీంతో సభ్యులు కాని వారు కూడా మద్యం సేవించి అల్లర్లకు పాల్పడుతుండటంతో సభ్యులు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. బార్‌లోకి ప్రైవేటు వ్యక్తులు వచ్చి అల్లర్లకు పాల్పడుతున్నారని కొంతమంది సభ్యులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కమిటీ సభ్యులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. బయటి కంటే పెగ్గుకు రూ.20 అదనంగా వసూలు చేస్తున్నా ఎక్సైజు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఈ క్లబ్‌కు గతంలో కమిటీ ఉండేది. తాజాగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించి బయిలాను మార్పుచేసి, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం సాయంత్రం నూతన కమిటీ చేత క్లబ్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా కేఈ ప్రతాప్, ఉపాధ్యక్షుడిగా వెంకటేష్, కార్యదర్శిగా బాలచంద్రారెడ్డి, సహాయ కార్యదర్శి ఎన్.ప్రభాకర్, స్పోర్స్, కల్చరల్ సహాయ కార్యదర్శి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, కోశాధికారి కేఈ శివరామ్‌గౌడ్, కార్యవర్గ సభ్యులుగా దుర్గా ప్రసాదరెడ్డి, కే పుల్లారెడ్డి, రమణగౌడ్, వెంకటరామరాజు, శివశంకర్‌రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.