ఏసియన్ పోటీల్లో కర్నూలు ‘తేజం‘
కర్నూలు: ఏసియన్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో జిల్లా కానిస్టేబుల్ కె.తేజేశ్వరరెడ్డి (పీసీ నెం.1399) రజతం, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. అక్టోబరు 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు థాయ్‌ల్యాండ్ దేశంలో ఈ పోటీలు జరిగాయి. మొత్తం 16 దేశాలు పాల్గొనగా.. థాయ్‌ల్యాండ్‌కు మొదటి స్థానం, ఇండియాకు రెండో స్థానం లభించింది. ఇండియా టీమ్ నుంచి మొత్తం 12 మంది పాల్గొనగా, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలుకు చెందిన తేజేశ్వరరెడ్డి ఉన్నారు. ఇండియాకు మూడు రజత, కాంస్య పతకాలు వచ్చాయి. ఇందులో తేజేశ్వరరెడ్డికి మిక్సిడ్ లైట్ వెయిట్ ఫోర్ 500 మీటర్స్ ఈవెంట్స్‌లో రజత పతకం, మిక్సిడ్ లైట్ వెయిట్ డబుల్ 200 మీటర్స్ ఈవెంట్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లో 2016 జనవరి జరిగిన సీనియర్ నేషనల్స్‌లో కూడా కాంస్య పతకం సాధించాడు. ఈయన 2013లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. సెయింట్ జోషఫ్ కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నారు. స్వగ్రామం ఓర్వకల్లు. తల్లిదండ్రులు రైతు కుటుంబానికి చెందిన వారు. పతకాలు సాధించి జిల్లాకు చేరుకున్న తేజేశ్వరరెడ్డిని శుక్రవారం సాయంత్రం పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆకె రవికృష్ణ, ఇతర పోలీసు అధికారులు అభినందించి శాలువాతో సత్కరించారు. 2018 ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచి పతకాలు కైవసం చేసుకొని జిల్లా పోలీసు శాఖ గౌరవాన్ని పెంచాలని ఎస్పీ కొనియాడారు.
కోచ్‌కు కృతజ్ఞతలు
కఠోరమైన శ్రమ, అంకిత భావం, క్రమశిక్షణ గల ఇండిన్ కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్‌బేగ్ శిక్షణతోనే ఈ గెలుపు సాధ్యమైందని తేజేశ్వరరెడ్డి అన్నారు. ఆత్మవిశ్వాసంతో, గెలవాలనే పట్టుదలతో ఇండియా టీమ్‌తో కలిసి థాయ్‌ల్యాండ్‌కు వెళ్లి ఏషియన్ చాపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. భారతదేశ జెర్సిని (ఇండియన్ ట్రాక్ షూట్) ధరించి గేమ్స్‌లో పాల్గొనడం మాటల్లో చెప్పలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. రెండు సంవత్సరాలు పడ్డ కష్టం అంతా ఈ పతకాలతో ఫలించిందన్నారు. తన విజయానికి సహకరించిన కోచ్ ఇస్మాయిల్‌కు తల్లిదండ్రులు వెంకటరామిరెడ్డి, క్రిష్ణవేణమ్మలకు, జిల్లా పోలీసు అధికారులకు తేజేశ్వరరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఆర్‌ఐలు జార్జ్, రంగముని, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.