
‘రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయం’
అనంతపురం మెడికల్ : రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా పని చేద్దామని కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పిలుపునిచ్చారు. రవాణా రంగంలో పని చేస్తున్న 405 మంది కార్మికుల పిల్లలకు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో శనివారం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో స్కాలర్‌షిప్పులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎస్పీ రాజశేఖర్‌బాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. జాతీయ రహదారులపై నిఘా ఉంచి తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల వరకు వాహనాలను ఆపి డ్రైవర్ల ముఖాలు కడిగించి పంపుతామన్నారు.
ఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ జోనల్ బిజినెస్ హెడ్ అంజా అలి, రీజనల్ బిజినెస్ హెడ్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ 7వ తరగతిలో 60 శాతం మార్కులు వచ్చిన వారికి మూడేళ్ల నుంచి స్కాలర్‌షిప్స్ ఇస్తున్నామన్నారు. డీఎస్పీలు శివరామిరెడ్డి, వెంకటరమణ, మహబూబ్‌బాషా, నరసింగప్ప, కంపెనీ రీజనల్ క్రెడిట్ హెడ్ రాజశేఖరరెడ్డి, సీనియర్ మేనేజర్ నాగేశ్వరయ్య, సీఐ యల్లమరాజు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. చివరగా విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శన ఆకట్టుకుంది.
ఆడిటోరియంలో ఉద్విగ్న క్షణాలు
ప్రముఖ నాట్యాచార్యులు సంధ్యామూర్తి ప్రసంగించే సమయంలో ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దంగా మారింది. తన భర్త రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారని, కుటుంబ పెద్ద దిక్కుపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆమె సూచించారు.