ధర్మవరం అర్బన్ : భవన నిర్మాణ కార్మికుడు ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రమైనా ఇంకా ఇంటికి రాకపోతే ఆ కుటుంబానికి ఎంతో ఆందోళన. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయం. ఇంటి పెద్ద అయిన కార్మికుడు ప్రమాదవశాత్తు లేదా సాధారణంగా చనిపోతే.. ఆ కుటుంబానికి ఒక్క రూపాయి సాయం చేసేవారు ఉండరు. కార్మిక బీమా పథకాలు అనేకం అమలు ఉన్నాయి. కార్మికులు సద్వినియోగం చేసుకుంటే ఆ కుటుంబాలకు ధీమానే.
– జిల్లాలో భవన, ఇతర నిర్మాణ రంగాల్లో నిర్మాణ కార్మికులు సుమారు 7.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరిలో 3.50 లక్షల మంది మాత్రమే కార్మిక చట్టం 1998 నిబంధనల ప్రకారం సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేయించుకున్నారు. మిగిలిన 4 లక్షల మంది అవగాహన రాహిత్యంతో పేర్లు నమోదు చేయించుకోలేదు. అసంఘటిత కార్మికులకు నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
దరఖాస్తు ఎలా...
ఎవరి సిఫార్సు లేకుండా కార్మికశాఖ ఇచ్చిన దరఖాస్తు ఫారం నింపి రూ.110 చెల్లిస్తే సరిపోతుంది. సొంతంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.అయిదేళ్లపాటు సభ్యుడిగా కొనసాగవచ్చు. నెలకు రూ.1 చొప్పున ఏడాదికి రూ.12 చెల్లించి రెన్యువల్ చేసుకోవచ్చు. సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోకపోతే రాయితీలు వర్తించవు.
ఏఏ వృత్తుల వారికి ప్రయోజనం అంటే...
భవన రోడ్డు నిర్మాణ కార్మికులు, మట్టి పని, ఫ్లోరింగ్ పనిచేసేవారు, రాడ్డు బెండింగ్, ఫిట్టర్లు, తాపీ మేస్త్రీలు, కూలీలు, ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పెయింటింగ్, సూపర్‌వైజర్లు, గుమస్తాలు, అకౌంటెంట్లు, ప్రొక్లెయిన్ కార్మికులు, ఇటుక బట్టీలో పనిచేసేవారు, ఉపాధి హామీ పథకం, క్వారీ కార్మికులు ఇందులో సభ్యులుగా చేరొచ్చు.
అందుబాటులో అనేక సౌకర్యాలు : కార్మికుడుగా పేరు నమోదు చేయించుకున్న వారికి పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.2లక్షలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.2లక్షలు వర్తిస్తుంది.
– సాధారణ మరణమైతే రూ.30వేలు, పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు 50 శాతం అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ.లక్ష పరిహారం వర్తిస్తుంది.
– చిన్నచిన్న దెబ్బలు తగిలి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఐదురోజులు దాటితే పోషణ నిమిత్తం రోజుకు రూ.100 వంతున నెలకు రూ.1500 మించకుండా పొందొచ్చు. ఈ సదుపాయం 3నెలల వరకు వర్తిస్తుంది. కార్మికుడు పని ప్రదేశంలో చనిపోతే ఇంటికి చేర్చేందుకు అయ్యే ఖర్చు కార్మికశాఖ చెల్లిస్తుంది. అంత్యక్రియల నిమిత్తం రూ.5వేలు మృతుడి కుటుంబానికి అందిస్తారు.
ప్రసూతి సాయం : కార్మికురాలు, కార్మికుడి భార్య, లేదా ఇద్దరు బిడ్డలకు ఈ సదుపాయం ఉంది. ఏదైనా ప్రభుత్వాస్పత్రిలో కాన్పు అయితే రూ.10 వేలు ఇస్తారు. ఈ సదుపాయం రెండు కాన్పుల వరకు వర్తిస్తుంది. ముందుగా కార్మికశాఖలో పేరు నమోదు చేయించుకోవాలి.
‘వివాహ బహుమతి’ : ఈ పథకం కింద రిజిష్టర్ అయిన అవివాహిత మహిళా కార్మికురాలు, కార్మికుడి ఇద్దరు కుమార్తెలకు ఈ పథకం వర్తిస్తుంది. కార్మికుడి కుమార్తె వివాహ సమయంలో రూ.5వేలు ఆర్థిక సాయం అందుతుంది. పెళ్లి, వయస్సు, ధ్రువీకరణ పత్రం, ఫొటో, వివాహ ధ్రువీకరణ పత్రం సహాయ కార్మిక అధికారికి అందజేస్తే ఈ నగదు అందజేస్తారు.