చిల్లర కష్టాలు | lack of coins | Sakshi
Sakshi News home page

చిల్లర కష్టాలు

Published Fri, Sep 2 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

చిల్లర కష్టాలు

చిల్లర కష్టాలు

తణుకు(పశ్చిమ గోదావరి జిల్లా):  ఉదయం పాల ప్యాకెట్‌ దగ్గర నుంచి మార్కెట్‌లో కూరగాయల కొనుగోలు, బస్సు ప్రయాణం ఇలా ప్రతిచోట చిల్లర అవసరం. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లో చిల్లర కష్టాలు వెంటాడుతున్నాయి. రూపాయి, రెండు, అయిదు రూపాయల నాణేలు దొరకడం కష్టంగా మారింది. దీంతో వ్యాపారులతో పాటు ప్రజలకూ ఇబ్బందులు తప్పడంలేదు. చిల్లర లేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నూటికి రూ.10 కమీషన్‌ చెల్లించి చిల్లర నాణేలు కొనుగోలు చేసి వ్యాపారాలు సాగించాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గినా మార్కెట్‌లో మాత్రం నిత్యం రూపాయి చిల్లర నాణెం లేనిదే వ్యాపార లావాదేవీలు ముందుకు సాగడంలేదు.  
 
వ్యాపారం కుదేలు
మార్కెట్‌లో చిల్లర కొరత కారణంగా వ్యాపారాలు కుదేలవుతున్నాయి. నిత్యం చిల్లర లేకపోతే రూపాయి, రెండు వంటి చిల్లరను కొన్ని సందర్భాల్లో వ్యాపారులు వదులుకోవాల్సిన పరిస్థితి. రూపాయి తక్కువైనా పర్లేదు కానీ చిల్లర చెల్లించి సహకరించాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రజలు వస్తువుల కొనుగోలుకు 10, 20, 50, 1,00, 5,00, 1,000 నోట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో హోటళ్లు, మెడికల్, కిరాణా, కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులకు చిల్లర కోసం ఇబ్బందులు తప్పడంలేదు. ఆర్టీసీ బస్సుల్లో అయితే కండక్టర్ల కష్టాలు అన్నీఇన్నీ కావు. కొందరు షాపుల్లో చిల్లర బదులు చాక్లెట్లు ఇచ్చి సరి చేసుకుంటున్నారు. బ్యాంకులు కొంత మేర చిల్లరను ప్రత్యేక కౌంటర్ల ద్వారా మేళాలు ఏర్పాటు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నప్పటికీ వ్యాపారుల పూర్తి అవసరాలను మాత్రం తీర్చలేకపోతున్నారు. దీంతో 90 శాతం వ్యాపారులు మాత్రం చిల్లర నాణేలు కమీషన్‌ పద్ధతిలో సమకూర్చుకోవడం చిరు వ్యాపారులకు భారంగా మారుతోంది. రోజువారి సంపాదనలో కొంత మొత్తం చిల్లర కొనుగోలుకే వెచ్చించాల్సివస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. 
 
చిల్లరవ్యాపారం నిత్యం రూ.అర కోటి
చిల్లర కొరతను కొందరు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. రూ.100 విలువ చేసే చిల్లర కావాలంటే అదనంగా రూ.పది తీసుకుంటున్నారు. సర్వసాధారణంగా కనిపించే చిల్లర వ్యాపారం ద్వారా నిత్యం రూ.50 లక్షల మేర కమీషన్‌ చేతులు మారుతోందంటే ఆశ్చర్యం కలగక మానదు. పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర నాణేలు విక్రయించేందుకు ప్రత్యేక వ్యాపారులు ఉండగా కొందరు కిరాణా షాపులు, కిళ్లీ బడ్డీల దుకాణాల్లో చిల్లర వ్యాపారం జరుగుతోంది. దేవాలయాల్లో హుండీలను తెరిచే సమయంలో అక్కడి అధికారులకు సైతం ‘కమీషన్‌’ చెల్లించి మరీ చిల్లర కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరికొందరు వ్యాపారులు బిక్షాటన చేసే వారి వద్ద నుంచి చిల్లర తీసుకుని వారికి నోట్లు ఇస్తున్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు బ్యాంకులు చిల్లర నాణేలు అందించే మేళాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అది పాటించడంలేదు. 
 
కష్టాలు తప్పడం లేదు
ప్రస్తుతం ఏ వస్తువు కొనుగోలు చేసినా ఎమ్మార్పీలు చిల్లర మొత్తంలోనే ఉంటున్నాయి. వాటి కొనుగోలు అనంతరం ప్రజలకు చిల్లర ఇవ్వాల్సి వస్తోంది. దీంతో గత్యంతరం లేక కమీషన్‌ రూపంలో చిల్లర కొనుగోలు చేసి కొనుగోలుదారులకు ఇస్తున్నాం. – వి.సూర్యనారాయణ, కిరాణా వ్యాపారి, వేల్పూరు
 
10 శాతం కమీషన్‌ ఇచ్చి కొంటున్నాం 
నా దుకాణంలో ప్రతి రోజు రూ.వెయ్యి వరకు చిల్లర అవసరమవుతుంది. అయితే చిల్లర కొరత 
కారణంగా కొన్ని సందర్భాల్లో బేరాలు వదులుకుంటున్నాం. దీంతో భారమైనా రూ.10 శాతం కమీషన్‌ ఇచ్చి చిల్లర కొనుగోలు చేస్తున్నాం.  – వైసీహెచ్‌ కృష్ణమూర్తి, వ్యాపారి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement