
ఆసియాలోనే పెద్ద జాతరకు రైళ్లు లేవా?
కోటి మందికి పైగా భక్తుల రాక
ప్రత్యేక రైళ్ల కోసం ఎంపీల వినతులు
ఉలుకూ పలుకూ లేని రైల్వేశాఖ
సాక్షి, హన్మకొండ : ఆసియాలోనే పెద్దదైన.. కోటి మంది భక్తులు హాజరయ్యే మేడారం గిరిజన జాతరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించడంలో రైల్వేశాఖ నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహారిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పెరిగే రద్దీకి అనుగుణంగా ఒక్క ప్రత్యేక రైలును ప్రకటించలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో సగం మేడారం బాటపట్టనున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇతర మార్గాల్లో ప్రత్యామ్నాయంగా రైళ్లను నడిపించాల్సి ఉంది. పెరగనున్న రద్దీ 2016 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మేడారం వచ్చే భక్తులు రైళ్ల ద్వారా కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం చేరుకోవచ్చు.
ముఖ్యంగా కాజీపేట రైల్వే జంక్షన్ ఉత్తర-దక్షిణ-పశ్చిమ ప్రాంతాలకు మధ్య వారధిగా ఉంది. ఈ మార్గం గుండా నిత్యం వందలాది రైళ్లు కిక్కిరిన ప్రయాణికులతో వెళ్తుంటాయి. జాతర సందర్భంగా వచ్చే ఉండే లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు సరిపోవు. ఖమ్మం-డోర్నకల్-కాజీపేట-బల్లార్షా, సికింద్రాబాద్-బల్లార్ష మార్గంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపించాల్సి ఉంది. కానీ ఈ దిశగా రైల్వేశాఖ ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడారం రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచాలని ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, పసూనూరి దయాకర్ ఇప్పటికే రైల్వేశాఖకు లేఖలు రాశారు.
బస్సులకేదీ ప్రత్యామ్నాయం?
2014 జాతర సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థకు 22 వేల బస్సులు ఉండేవి. వీటిలో 3200 బస్సులను మేడారం జాతరకు కేటాయించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ పరిధిలో 95 డిపోలు ఉండగా 10,454 బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సిటీ బస్సులు, ఇతరత్రా మినహాయిస్తే పూర్తిస్థాయి కండిషన్‌లో 8000 బస్సులుంటాయి. వీటిలో దాదాపు 4,000 బస్సులను మేడారం జాతరకు నడిపించేందుకు సిద్ధమని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ బస్సులన్నీ ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు జాతర కోసం కేటాయించనున్నారు. దీంతో వారం రోజులపాటు పది జిల్లాల పరిధిలో నిత్యం తిరిగే బస్సుల సంఖ్య తగ్గిపోనుంది.
ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా రైళ్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. కాజీపేట- సికింద్రాబాద్-నిజామాబాద్, సికింద్రాబాద్-కాజీపేట-బల్లార్షా, కరీంనగర్-సిర్పూర్ కాగజ్‌నగర్, భద్రాచలం రోడ్డు-డోర్నకల్-కాజీపేట మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా మరికొన్ని రైళ్లను నడిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకమంటే అటే.. సంక్రాంతి, దసరా పండగల సందర్భంగా రైల్వేశాఖ నెల రోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంది. ఇందులో తొంభై శాతం రైళ్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుకు వెళ్తాయి. కానీ ఆసియాలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రైల్వేశాఖ ఎలాంటి ముందస్తు సన్నాహాకాలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.