
లక్ష్మీ ప్రసన్న హత్య కేసులో కొత్త మలుపు
మేడ్చల్: చిన్నారి లక్ష్మీ ప్రసన్న హత్యకేసులో విచారణను మేడ్చల్ పోలీసులు ముమ్మరం చేశారు. లక్ష్మీ ప్రసన్న తల్లితండ్రులకు మిగతా కుటుంబసభ్యులకు తరచూ గొడవలవుతూ ఉండేవని, భార్యభర్తల మధ్య కూడా అన్యోన్యత లేదని గ్రామస్ధులు చెబుతున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యుల కాల్ డేటా వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పథకం ప్రకారమే చిన్నారిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
కుటుంబసభ్యులే చిన్నారిని హతమార్చి ఉంటారని గ్రామస్ధులు చెబుతుండటంతో పోలీసుల అనుమానం బలపడింది. ఎల్లంపేటలో హత్య జరిగిన రోజు మధ్యాహ్న సమయంలో లక్ష్మీ ప్రసన్న తాత ఇంటికి వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో లక్ష్మీ ప్రసన్న తల్లి, తండ్రి, పిన్ని, తాతయ్యలను పోలీసులు ప్రశ్నించి.. తాతను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.