భూసేకరణ ప్రభుత్వం వల్ల కాదు
భూసేకరణ ప్రభుత్వం వల్ల కాదు
Published Fri, Dec 2 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
రైతులకు అండగా వైఎస్సార్ సీపీ
ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) భరోసా
మంగళగిరి : రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణలో ఇవ్వని రైతుల భూములను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో సేకరించలేదని, రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్పష్టం చేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సమీకరణలో భూములు ఇవ్వని రైతులకు అండగా తాము కోర్టును ఆశ్రయించగా, కోర్టు రైతులకు అండగా నిలబడిందన్నారు. వారంతా వ్యవసాయం చేసుకుంటూ, వారి కుటుంబాలతో పాటు, ఆ భూములపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలకు ఉపాధి చూపిస్తున్నారన్నారు. భూసమీకరణకు భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమకే పనులు లేక ప్రభుత్వం చెప్పిన పరిహారం అందక కూలిపనులు వెతుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూములను సేకరించేందుకే సీఆర్‌డీఏ సిద్ధమవుతోందని, సీఆర్‌డీఏ అధికారులే తాము ఎవరినీ బలవంతం చేయట్లేదని, ఇష్టమైన వారు మాత్రమే ఇస్తున్నారని, ఇవ్వని వారి భూములు సేకరించబోమని కోర్టులో స్పష్టం చేశారన్నారు. కోర్టును ఆశ్రయించి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల జోలికి వస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని గుర్తుంచుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్విరాన్‌మెంట్ ప్రొటక‌్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్‌స్ట్యూట్ (ఈపిటిఐఆర్) సంస్థ ముందుగా గ్రామాలలో రైతులకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి సర్యే నిర్వహించకుండా సమావేశాలు ఏర్పాటు చేయడం రైతులను తప్పుదోవపట్టించడమేనని చెప్పారు.
Advertisement