అడ్డొస్తే అంతు చూస్తాం...
= వంక స్థలం ఆక్రమణకు రౌడీల యత్నం
= అడ్డుకున్న స్థానికులు, కార్పొరేటర్
అనంతపురం క్రైం : మేం పరిటాల మనుషులం..ఈ స్థలం మాది.. అందుకే ఇక్కడ చదును చేస్తున్నాం. ఎవరైనా కాదంటే అంతు చూస్తాం. ఇవీ వంక స్థలాన్ని కబ్జా చేసేందుకు వచ్చిన వారి వ్యాఖ్యలు. అయితే స్థలం కబ్జాదారులను స్థానికులు, మూడో డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ గిరిజమ్మ అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... మూడవ డివిజన్ పరిధిలోని వేణుగోపాల్‌నగర్ 80 అడుగుల రోడ్డుకు అడ్డంగా వంక పారుతోంది. అయితే, ఆ స్థలానికి సంబంధించిన యజమాని మృతి చెందారు. కొంతమంది కబ్జాదారులు వంకను కబ్జా చేయడానికి నకిలీ పత్రాలను సృష్టించారు.
శనివారం కొంతమంది రౌడీలు అక్కడికి ప్రవేశించి వంక స్థలాన్ని ఆక్రమించాలని జేసీబీలతో పనులు చేపట్టారు. అయితే స్థానికులు, కార్పొరేటర్ గిరిజమ్మ వారిని అడ్డుకున్నారు. ఏయ్ మేము ఎవరో తెలుసా? పరిటాల మనుషులం. అడ్డొస్తే మీ అంతు చూస్తామని రౌడీలు మహిళా కార్పొరేటర్‌పై దౌర్జన్యానికి దిగారు. దీంతో కార్పొరేటర్ ఈ విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ స్థలాన్ని ఆక్రమిస్తే వంక నీరంతా ఇళ్లల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని కార్పొరేటర్ గిరిజమ్మ పోలీసులకు వివరించారు. మంత్రి పేరు చెబుతూ వారి బంధువులమని టౌన్ ప్లానింగ్ అధికారులను బెదిరించి వంక స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల రంగ ప్రవేశం
వంక స్థలాన్ని కొంతమంది రౌడీలు ఆక్రమిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో వన్‌టౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వంక స్థలాన్ని కబ్జా చేయడానికి వచ్చిన రియాజ్, బాబాలతో పాటు మరో ఆరు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబ్జాదారులకు పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.