భాషకాదు.. కథాంశమే ముఖ్యం
భాషకాదు.. కథాంశమే ముఖ్యం
Published Mon, May 29 2017 10:46 PM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM
దంగల్ డైరెక్టర్ నితిష్ తివారీ
అమలాపురం : ‘భాష ఏదన్నది కాదు.. కథాంశమే ముఖ్యం. బాలీవుడ్‌లో మాత్రమే సినిమా తీయాలనే ప్రత్యేక నియమం ఏదీ నేను పెట్టుకోలేదు. మంచి కథాంశం దొరికితే ఏ భాషలోనైనా సినిమా తీస్తాను’ అని చెప్పారు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ రైటర్ నితిష్ తివారి. కోనసీమలో ‘మీ నిజమైన సంపద’ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణకు వచ్చిన ఆయన తన భావాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..
కథకు నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను. కథను బట్టే ఏ భాషలో తీయాలనేది నిర్ణయించుకుంటాను. ఇప్పుడు తీస్తున్న షార్ట్‌ఫిల్మ్ హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే రెండు మూడు కథలను సిద్ధం చేస్తున్నాను. కథలు పూర్తయ్యాకా ఏ కథాంశం బాగుంటే దానినే తెరకెక్కించే సన్నాహాలు చేస్తాను.
– ఇప్పటి వరకు మూడు సినిమాలు తీశాను. దంగల్ సినిమా తీసేందుకు రూ.70 కోట్ల వరకు ఖర్చయితే.. దేశంలో రూ.850 కోట్ల వరకు వసూలు చేసింది. సినిమాలకు ముందు నేను చాలా షార్ట్‌ఫిల్మ్స్, యాడ్‌ఫిల్మ్ ్స చేశాను. మూడు గంటల సినిమా అయినా.. మూడు నిమషాల షార్ట్‌ఫిల్మ్ అయినా నేను ఒక విధంగా కష్టపడతాను.
– రెండు,మూడు నిమషాల షార్ట్‌ఫిల్మ్ తీయడం చాలా సులువు అని అందరూ అనుకుంటారు. కానీ అదే చాలా కష్టం. రెండున్నర గంటల్లో చెప్పాల్సింది రెండున్నర నిమిషాల్లో ప్రేక్షకులకు చెప్పడం అంత సులువేం కాదు. కథతోపాటు నటీనటుల హావభావాలు, సున్నితాంశాలను చాలా తక్కువ సమయంలో ఎక్కువ చూపించాలి.
– బాహుబలి పార్ట్–1, పార్ట్–2 చూశాను. చాలా అద్భుతంగా ఉంది. కెమెరాతో మొదట తీసేదానికి గ్రాఫిక్స్‌లో విజువలైజేషన్‌కు చాలా తేడా ఉంటుంది. ఇది దర్శకుని ప్రతిభమీద, అతని ఊహాశక్తిపైన ఆధారపడుతుంది. ఈ విషయంలో రాజమౌళి చాలా అద్భుత ప్రతిభ చూపారు. అందుకే బాహుబలికి అంతక్రేజ్ వచ్చింది.
– బాహుబలి వసూళ్లను మించిన సినిమా తప్పకుండా వస్తుందనే నేను నమ్ముతున్నాను. రావాలి కూడా.. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇంకా మంచి ఫలితాలు సాధిస్తుంది.
– టాలీవుడ్‌కు.. బాలీవుడ్‌కు చాలా తేడాలున్నాయి. సినిమా మేకింగ్ విషయంలో కూడా తేడా ఉంది. అయితే రెండుచోట్లా ప్రేక్షకులు నూతనత్వాన్ని కోరుకుంటున్నారు. రెండు ఇండస్ట్రీలలోను సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. దీని వల్ల నిర్మాణ వ్యయాలు కూడా పెరుగుతున్నాయి.
– కోనసీమ చాలా బాగుంది. ఇంత మండు వేసవిలో కూడా పచ్చదనమే కనిపిస్తోంది. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. కానీ ప్రజలు చూపుతున్న ఆదరణ, వారు పలుకుతున్న స్వాగతం మనస్సుకు చాలా హాయినిస్తోంది. పచ్చని ప్రాంతంలో పనిచేయడం మరిచిపోలేను. ఇక్కడ ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నాలుగు రోజులుగా పనిచేస్తున్నాను. మరో రెండు రోజులు పనిచేయాల్సి ఉంది.
Advertisement
Advertisement