లేరు కుశలవుల సాటి..
అన్నదమ్ముల అనుబంధంలో వారే మేటి
లవకుశ సినిమా వచ్చి 53 ఏళ్లు. ఈ చిత్రంలో నటించిన లవకుశల ఆత్మీయానుబంధం వయసు కూడా అంతే. రక్తసంబంధం కంటే గొప్పది వీరి అనుబంధం. ఎక్కడొ పుట్టి...ఎక్కడో పెరిగినా... శ్రీరామరక్షతో అన్నదమ్ములయ్యారు. వర్ణాలు వేరైనా సీతమ్మ ఆశీస్సులతో ఒక్కటిగా పెరిగారు. అలా పెనవేసుకున్న వీరి అనురాగ గంగా ఐదు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. నటరత్న తారకరామారావు నటించిన చిత్రంలో వీరిద్దరే హీరోలు. పేర్లు వేరైనా నేటికీ లవకుశలుగానే జనహృదిలో నిలిచారు. దేవుడు కలిపిన ఈ అనుబంధంలో తలమునకలవుతున్నామంటున్న కుశుడు: నాగ సుబ్రహ్మణ్యం. లవుడు : నాగరాజు శ్రీరామనవమి సందర్భంగా సత్కారం అందుకునేందుకు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాల దొంతరలను సాక్షితో పంచుకున్నారు.
సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువే.... కుశుడు (నాగ సుబ్రహ్మణ్యం)
నేను అమలాపురంలో టైలరింగ్ పనిచేస్తున్నాను. ముగ్గురు అబ్బాయిలు. లవకుశ చిత్రం 1958లో మొదలై 1963లో పూర్తయింది. షూటింగ్ మొదలయ్యే నాటికి నా వయస్సు 11 సంవత్సరాలు. పూర్తయ్యాక 16 ఏళ్లు. ఆ ఐదేళ్లు మదరాసు కేసరి హైస్కూల్లో చదువుకున్నాను. లవకుశ తర్వాత సీతారామ కల్యాణం, వెంకటేశ్వర మహత్యం, వెలుగునీడలు చిత్రాల్లో నటించాను.అప్పట్లో 30 ఏళ్లు దాటితేనే హీరో వేషాలు వేయించేవారు.
అందువల్ల నేను నా స్వగ్రామం అమలాపురం వచ్చేసి బుర్రకథలు చెప్పేవాడిని. 1955 నుంచే అంటే నా ఎనిమిదో ఏట నుంచే బుర్రకథలు చెప్పాను. మా నాన్నగారు ఉయ్యూరు సుబ్బారావు (కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీక్లబ్ వ్యవస్థాపకుల్లో ఒకరు) దగ్గర బుర్రకథ ఎలా చెప్పాలో నేర్చుకున్నాను. కాకినాడ మ్యాజెస్టిక్ టాకీస్లో నా ప్రదర్శనకు దర్శకుడు సి.పుల్లయ్య రావడం, నన్ను కుశుడి పాత్రకు ఎంపిక చేయడం యాదృచ్చికంగా జరిగింది. ఆ చిత్రం విడుదలై 53 ఏళ్లు అయినా నేటికీ మేమిద్దరం సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉంటున్నాం
.
షూటింగ్ సమయంలో పడిన కష్టాలు చెప్పుకుంటే ఇప్పుడు హాస్యాస్పదంగా ఉంటుంది. నా ఒంటికి నీలిరంగు పూసేటప్పుడు, కడిగేటప్పుడు మంటగా ఉండేది. లవకుశ మొట్టమొదట రంగుల చిత్రమే కాకుండా 'గేవా' రంగులతో చిత్రీకరించారు. ఓవర్ లైట్ భరించలేకపోయేవాళ్లం. అంత వేడిలో సొంత డైలాగులు చెప్పడం, పాటకు తగ్గట్లు నర్తించడం.... అది చెప్పరాని బాధ. వీటికి తోడు ఎన్టీ రామారావు, అంజలీదేవి వంటి అగ్రస్థాయి నటులతోనటించడం.
ఆరునెలల పాటు రోజుకు రెండు గంటల పాటు వెంపటి పెద్దసత్యం, చినసత్యం గార్ల నాట్య శిక్షణ, బాణాలు వేయడంలో ప్రత్యేక శిక్షణాధికారి దగ్గర శిక్షణ ఇప్పించారు. పెద్దవాడైన కుశుడి పాత్రలో కొంత శాంత స్వభావం ఉంటుంది. లవుడిలో చురుకుదనం ఎక్కువ. నాలో ఉండే నెమ్మదితనం చూసి నన్ను కుశుడిగా, చురుకుగా ఉన్న నాగరాజును లవుడిగా ఎంచుకున్నారు. ఎప్పుడైనా మా ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చినా నేను పెద్దవాడిని కావడం వల్ల సర్థుకు పోతాను.
అందువల్ల మా ఇద్దరి మధ్య మైత్రి ఇంకా లతలా పెనవేసుకుపోయింది. నేను చాలాకాలం తెరమరుగున ఉండిపోవడంతో చాలా మంది కుశుడు మరణించాడు అని ప్రచారం చేశారు. ఓ ఆంగ్లపత్రిక నన్ను గుర్తించి మళ్లీ ప్రపంచానికి పరిచయం చేసింది. 2006 నుంచి మళ్లీ నన్నంతా గుర్తిస్తున్నారు.
నా కోసం ఆ పద్యాన్నే మార్చేశారు
లవకుశ నాటకంలో నటించిన అనుభవం నాకు ఈచిత్రంలో నటించేందుకు బాగా ఉపయోగపడింది. లీలగారి చేత పాడించిన 'ఇనుడస్తాద్రిని...' పద్యానికి అనుగుణంగా నేను నటిస్తున్నప్పుడు పుల్లయ్యాగారు 'ఈ పద్యంలో కావాల్సినంత ఫోర్స్ రావట్లేదు' అన్నారు. వెంటనే నేను నాటకంలో పాడిన విధంగా పద్యం చదివి వినిపించాను. ఆయనకు బాగా నచ్చింది. ఘంటసాల గారు ఆ పద్యాన్ని వెంటనే మార్చి మళ్లీ పి.లీలగారితో పాడించారు. నా జీవితంలో అదొక మరపురాని సంఘటన. నటరత్న ఎన్టీఆర్కు అల్లుడైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పట్ల సానుకూలంగా స్పందించకపోవడం హాస్యాస్పదం.
రూ. 40 లక్షల బడ్జెట్కు మేమే బేస్ : లవుడు నాగరాజు
నేను ప్రస్తుతం పరిపూర్ణానందస్వామి నిర్మిస్తున్న గోమాత వైభవం' సిరియల్లో కపిల మహర్షి వేషం వేస్తున్నాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.మా నాన్నగారు ఏవీ సుబ్బారావు సీనియర్ ( పల్లెటూరు పిల్ల, కీలుగుర్రం,పెద్ద మనుషులు చిత్రాల్లో నటించారు). చిత్తూరు నాగయ్య గారు అనుకోకుండా నన్ను చూశారు.
ఆయన నిర్మిస్తున్న భక్త రమదాసు చిత్రంలో రఘురాముడి పాత్రకు నన్ను ఎంపిక చేశారు. అప్పుడు నా వయస్సు ఏడేళ్లు. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించాను. మా నాన్నగారు, సి.పుల్లయ్య గారు మిత్రులు కావడంతో ఆయన నన్ను తరచూ చూస్తుండేవారు. నాలోని చురుకుదనం చూసి నన్ను లవుడి పాత్రకు ఎంపిక చేశారు. మాకు డైలాగ్ డెలివరీ నుంచి, సుశీల -లీల గార్లు మాకు పాడిన పాటలకు లిప్ మూమెంట్ ఇచ్చేలా నటించే వరకూ శిక్షణ ఇచ్చారు.
షూటింగ్ సమయంలో తెల్లవారుజామున 4.30కు కారు వచ్చేది. మేము 4 గంటలకు లేచి మా పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండేవాళ్లం. స్టూడియోకు వెళ్లి ఐదు గంటలకు మేకప్ వేసుకుని, షూటింగ్ స్పాట్కు 7 గంటలకు చేరుకుని ఫస్ట్ షాట్కు సిద్ధమయ్యేవాళ్లం. మళ్లీ రాత్రి తొమ్మిది గంటలకే మేకప్ తీయడం. సెట్-కు వెళ్లేసరికి మేమిద్దరం పాత్రలో లీనమైపోయేవాళ్లం. షూటింగ్ మొదలయ్యాక మాకు ద్రవ పదార్థాలు మాత్రమే ఆహారంగా ఇచ్చేవారు. రాత్రి షూటింగ్ పూర్తయిన తర్వాతే అన్నం పెట్టే వారు. ఆ తర్వాత హాయిగా నిద్రపోయేవాళ్లం.
మా ఇద్దరిని బేస్ చేసుకుని రూ. 40 లక్షల బడ్జెట్తో ఈ చిత్రం తీశారు. అందుకు తగ్గట్టు నటించడంలో మా ఇద్దరికీ శక్తిసామర్థ్యాలు కలిగేలా చేసిన దర్శకుడు పుల్లయ్యగారికి మేం రుణపడి ఉంటాం. లవకుశ సినిమా తర్వాత కొన్నాళ్లు ఇద్దరం కలవలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమలాపురం వెళ్లినప్పుడు సుబ్రహ్మణ్యమే వచ్చి కలిశాడు. అప్పుటి నుంచి ఇద్దరం కలుస్తునే ఉంటాం.