పోలీసులంటే భయమే లేదు
కేవలం మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో పట్టపగలు జరిగిన రెండు దారుణ హత్యలు పోలీసుల పనితీరుకు పెనుసవాల్‌గా నిలిచాయి. పోలీసులంటే భయమే లేకుండా.. ఆ తర్వాత ఏం జరుగుతుందనే లెక్కే లేకుండా నిందితులు కిరాతకంగా హత్యలకు పాల్పడి పరారైన వైనాలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి.
ప్రజల ప్రాణాలకు రక్షణ ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. యాదృచ్ఛికమో కావొచ్చు గానీ జిల్లా కేంద్రం ఏలూరులో న్యాయవాది పీడీఆర్ రాయల్, గోదావరి తీర పట్టణం కొవ్వూరులో టీడీపీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ హత్యలు పట్టపగలే చోటుచేసుకున్నాయి. హతులిద్దరూ సామాన్యులేం కాదు. గోపాలకృష్ణ మూడుసార్లు కౌన్సిలర్‌గా గెలుపొందడంతోపాటు పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
స్థానికంగా బీసీల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఇక ఏలూరుకు చెందిన రాయల్ పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టగల న్యాయవాదిగానే కాకుండా కాపు సామాజికవర్గ నేతగా, నగర ప్రముఖునిగా వెలుగొందాడు. అటువంటి నేపథ్యం కలిగిన ఆ ఇరువురినీ నరికిచంపిన దారుణం చూస్తుంటే జిల్లాలో పోలీస్ పనితీరు ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది.
ఆ రెండు కేసుల్లో తేడా..
ప్రాణహాని ఉందని టీడీపీ కౌన్సిలర్ గోపాలకృష్ణ గతంలో ఎన్నోమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఖాకీల వైఫల్యం వల్లే టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడని స్వయంగా అధికార పార్టీకే చెందిన కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మండిపడ్డారు. దీంతో ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఒకటి రెండు రోజుల్లోనే కీలక నిందితులను అరెస్ట్ చేశారు. కానీ.. ఏలూరుకు చెందిన రాయల్ కేసును మాత్రం ఇంకా ఛేదించలేకపోయారు. కత్తులతో నరికి చంపిన ఓ నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిచ్చినా పోలీసులు ఈ కేసులో ఏ మాత్రం పురోగతి సాధించలేకపోయారు.
మిగిలిన నిందితులు పోలీసులకు చిక్కకుండా నేరుగా కోర్టులో లొంగిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రాయల్ హత్య జరిగిన వెంటనే పోలీసులు పక్కా యాక్షన్ తీసుకుంటే నిందితులు దొరికేవారు. కానీ.. రాజకీయ నేపథ్యం ముడిపడి ఉండటంతో పోలీసులు ఒకింత ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే ఇప్పుడు కేసు క్లిష్టంగా మారిందని అంటున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న రాయల్‌ను చూసేందుకు ఎవరెవరు వచ్చారు.. ఆ తర్వాత అంతిమ యాత్రలో ఎవరెవరు పాల్గొన్నారు.. వచ్చిన వారిలో పోలీసులెవరైనా ఉన్నారా.. అనే వివరాలను ఆరా తీయడంలో శ్రద్ధ చూపిన పోలీసులు అసలు నిందితులను పట్టుకునే పనిమాత్రం ఒకింత ఆలస్యంగానే చేపట్టారనే చెప్పాలి.
సిఫార్సు పోస్టింగ్‌ల విపరిణామాలివి
టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉన్న వారికే పోస్టింగ్‌లు ఇచ్చే నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నిర్వాకం వల్లనే జిల్లాలో పోలీస్ పనితీరు ఇంత దారుణంగా తయారైందన్నది తిరుగులేని వాస్తవం. జిల్లాలో ఎక్కడికక్కడ పోలీసులు రాజకీయ క్రీనీడలో పనిచేస్తుండటం వల్లనే ఓ దశలో ఉన్నతాధికారులను కూడా లెక్కచేయని స్థితికి వెళ్లిపోయారు.
ఇప్పుడు నడిరోడ్డుపై హత్యలు జరిగినా.. విచారణ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తమకు సిఫార్సులు చేసిన రాజకీయ నేతలకు చుట్టుకుంటాయేమోనన్న భయం పోలీసులను వెంటాడుతోంది. ఆ భయంతో కొట్టుమిట్టుడుతున్న ఖాకీలు సామాన్య జనాలకు ఏం భద్రత కల్పిస్తారు. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉన్న వారికి ఏం రక్షణ కల్పిస్తారు.. వాస్తవాలు రాసే జర్నలిస్టులపైనా కత్తిగట్టిన దళారులను ఎలా కట్టడి చేస్తారన్నది ఆ దేవుడికే ఎరుక!
నెలాఖరు నాటికి పూర్తి
ప్రతి మండలం, ప్రతి గ్రామంలో రైతుల సాగు వివరాలు నమోదు చేయించి ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నాం. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ యాప్‌ను రైతులకు, ప్రజలకు, అధికారులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ యాప్ ఆధారంగానే ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది.- మహ్మద్‌హసీం షరీఫ్,
జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు