న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు దహనం
బార్ కౌన్సిల్ సభ్యులు విధుల బహిష్కరణ
జేసీ-2కి వినతిపత్రం అందజేత
రాజమహేంద్రవరం క్రైం, కాకినాడ లీగల్ : న్యాయవాదులు, ప్రజల హక్కులను హరించేలా రూపొందించిన 1961 న్యాయవాదుల చట్ట సవరణ బిల్లును నిరసిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈ బిల్లును ప్రతిపాదించిన లా కమిషన్ చైర్మన్ బల్బీర్ సింగ్ చౌహాన్‌ను తక్షణమే ఆపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బల్బీర్ సింగ్ చౌహాన్ దిష్టిబొమ్మను, న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు కాపీలను దహనం చేశారు. రాజమహేంద్రవరంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలోను, కాకినాడలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రాజేష్, కార్యదర్శి గెద్దాడ వెంకటేశ్వరరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు గోకుల్ కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద ఆందోళన చేశారు. అలాగే అమలాపురం, మండపేట, తుని, పిఠాపురం, పెద్దాపురం తదితర కోర్టులలో న్యాయవాదులు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ – 2 రాధాకృష్ణకు మెమొరాండం సమర్పించారు. రాజమహేంద్రవరంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు వలన కక్షిదారులు వారికి కావలసిన న్యాయవాదులను నియమించుకునే హక్కును కోల్పోతారన్నారు. అదే విధంగా న్యాయవాదులు కూడా స్వేచ్ఛగా తమ వద్దకు వచ్చిన కేసులను వాదించడానికి సాధ్యం కాదన్నారు. న్యాయవాదుల మీద దాడులు జరిగినా, లేదా ప్రజా ప్రయోజనాల దృష్టా ్య ఆందోళన చేసే హక్కును కూడా ఈ సవరణలతో న్యాయవాదులు కోల్పోతారన్నారు. ఈ సవరణలు రాజ్యాంగ విరుద్ధమైనవని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పీఆర్‌ఎస్ మిత్రా, ఉపాధ్యక్షుడు ఎ. వెంకట రాజు, ట్రెజరర్ కె. బాల భాస్కర్, సీనియర్ న్యాయవాది తవ్వల వీరేంద్ర, మహిళా రిప్రజెంటేటివ్ దాసరి అమ్ములు, జేవీవీ రమణ, పెల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాకినాడలో జరిగిన ఆందోళనలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చిక్కాల అబ్బు, దేశి, న్యాయవాదులు పాల్గొన్నారు.