పోలీసుల అదుపులో న్యాయవాది భార్య
విజయవాడ : టర్కీ దేశపు నోట్లను చెలామణి చేసేం దుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఓ న్యాయవాది భార్య సహా ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.5 లక్షల డినామినేషన్‌తో కూడిన 100 టర్కీ దేశం నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా విచారణ పేరిట వీరిని పోలీసు స్టేషన్‌లో ఉంచారని ఆరోపిస్తూ కొందరు న్యాయవాదులు సోమవారం రాత్రి గవర్నరుపేట పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగగా..పోలీసు అధికారులు సర్ధుబాటు చేసి పంపారు.
వివరాల్లోకి వెళితే.. తిరువూరుకు చెందిన ఓ హైకోర్టు న్యాయవాది భార్య తన వద్ద టర్కీ దేశం నోట్లు ఉన్నాయంటూ పలువురికి చెప్పింది. తనకు రూ.10 లక్షలు చెల్లించి వాటిని తీసుకోవచ్చని, మార్చుకుంటే రూ.కోట్లు వస్తాయంటూ కొందరి వద్ద నమ్మబలికింది. విషయం తెలిసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొనుగోలుదారుల మాదిరి రంగప్రవేశం చేసి గాంధీనగర్‌లో ఆమెతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి టర్కీ నోట్లను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం గవర్నరుపేట పోలీసులకు అప్పగించారు. టర్కీ నోట్లపై గవర్నరుపేట పోలీసులు విచారణ చేపట్టారు.
ఇతర దేశాలకు చెందిన నోట్లను విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టానికి లోబడి మార్పిడి చేయాల్సి ఉంటుందంటున్నారు. పైగా ప్రపంచంలోనే రూ.5 లక్షల డినామినేషన్‌తో కూడిన నోట్లు ఉండవనేది పోలీసుల వాదన. వీటిని నిర్థారించుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే నాలుగు రోజుల పాటు విచారణ పేరిట పోలీసు స్టేషన్‌కి రప్పించడాన్ని న్యాయవాదులు తప్పుబడుతున్నారు. దీనిపై కొందరు న్యాయవాదులు సోమవారం రాత్రి గవర్నరుపేట పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పరిగణలోకి తీసుకొని మంగళవారం ఓ నిర్ణయం తీసుకుంటామంటూ పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.