– ఇంటర్వ్యూలో సినీ హీరో సుమన్
బనగానపల్లె: చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, సుమన్ ఈ ఐదుగురు ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట పాపులర్ హీరోలు. వీరందరిలో ఎవరు బెస్టో చెప్పడానికే సాధ్యమయ్యేది కాదు. కానీ ప్రతిభ ఉన్నా అదృష్టం కూడా ఉండాలంటారు. అది కొందరికి కొన్ని సమయాల్లో వరించదు. అందులో సుమన్ ఒక్కరు. ఫలితంగా కొంత కాలం ఇండస్ట్రీకి దూరం అయినా పడిలేచిన కెరటమయ్యారు.
హీరో పాత్రలకే మడికట్టుకు కూర్చోకుండా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని ఇప్పటికి దాదాపు 450 చిత్రాల్లో నటించారు. తాజాగా నిర్మాత మహేష్ ఖన్నా గౌడ్ నిర్మిస్తున్న "సత్యాగ్యాంగ్" సినిమాలో ఏసీపీ పాత్రలో ఇమిడిపోతున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు గ్రామ సమీపంలోని తెల్లటి పాలరాతి కొండలపై ఉన్న నవాబుల సమ్మర్ ప్యాలెస్ వద్ద మంగళవారం ఈ సినిమా చిత్రీకరించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు.
మీ సినీ ప్రస్థానం ప్రారంభం ఎప్పుడు?
సుమన్: 1977లో తమిళ చిత్రం స్విమ్మింగ్‌పూల్ చిత్రం సినీ రంగప్రవేశం చేశాను. తెలుగులో హీరోగా 1980లో ఇద్దరు కిలాడీలు చిత్రంలో నటించినా విడుదల ఆలస్యం కావడంతో ఆ తర్వాత నటించిన తరంగిణి చిత్రం మొదటి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌హిట్ అయింది.
ఎన్ని భాషల్లో ఇంతవరకు ఎన్ని చిత్రాల్లో నటించారు?
సుమన్: తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లిష్, హిందీ, కొరియా భాషల్లో కలిపి సుమారు 450 చిత్రాల్లో నటించాను.
తెలుగులో నటించిన చిత్రాలు?
సుమన్: 99 చిత్రాల్లో హిరో పాత్ర పోషించాను. ప్రస్తుతం పోషిస్తున్న సత్యాగ్యాంగ్ 100వ చిత్రం.
మీకు నచ్చిన చిత్రం?
సుమన్: అన్నమయ్య చిత్రం పూర్తి సంతృప్తినిచ్చింది. అందులో పోషించిన వేంకటేశ్వరస్వామి పాత్ర ప్రజలను కూడా మెప్పించింది. ఇంకా పౌరాణిక చిత్రం భక్తరామదాసు, సత్యనారాయణస్వామి, తరంగిణి, నేటి భారతం, బావబామ్మర్ది, 20వ శతాబ్దం, సితారతోపాటు మరిన్ని చిత్రాలు పేరుతెచ్చాయి.
హీరోగా ఉన్న మీరు తమిళ చిత్రం శివాజీలో విలన్‌గా నటించడం?
సుమన్: ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. అందుకే నటించాను. ప్రజలు కూడా ఆదరించారు.
ప్రస్తుతం ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నారు?
సుమన్: తెలుగు, కన్నడ, తమిళం, ఒరియా భాషల్లో 10 నుంచి 12 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. వచ్చే జనవరి చివరి నాటికి 5 నుంచి 6 సినిమాలు విడుదలవుతాయి.
రాయలసీమలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై మీ అభిప్రాయం?
సుమన్: రాయలసీమ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లకు అవసరమైన లోకేషన్లు చాలా ఉన్నాయి. వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధికి ప్రభుత్వం ముందుకురావాలి. ఈ ప్రాంతం నుంచి నిర్మాతలు వస్తే మంచి ఆర్టిస్ట్‌లు ఇక్కడే పుట్టుకొస్తారు. సత్యాగ్యాంగ్ సినీ నిర్మాత డోన్‌కు చెందిన మహేష్ ఖన్నాగౌడ్ అవడం నాకెంతో ఆనందం. ఈ సినిమా విజయవంతమవుతుందన్న నమ్మకం నాకుంది.
సినిమాల్లో మీకు కొంతకాలం గ్యాప్ రావడానికి కారణం?
సుమన్: ఈ సమస్య సినిమాలోని ప్రతిఒక్కరికీ ఉంటుంది. మహానటుడు ఎన్టీఆర్‌కే కొంతకాలం గ్యాప్ ఏర్పడింది.
ప్రస్తుత రాజకీయాలపై మీ అభిప్రాయం?
సుమన్: అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయిననూ అన్ని వర్గాల మన్ననలు చూరగొనాలి. క్రైం నేరాన్ని తగ్గించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి, విద్యార్థులకు ఉన్నత చదువుల అవకాశాలు కల్పించాలి. కొంతకాలంగా పాలకుల్లో ఈ పరిస్థితి అగుపించడంలేదు.
మీరు ఏ పార్టీకి మద్దతు అందిస్తారు? లేక ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తారా?
సుమన్: ప్రత్యేక పార్టీ ఏర్పాటుచేసే ఆలోచన లేదు. 2019 ఎన్నికల నాటికి అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి నచ్చిన పార్టీకి తన మద్దతు ఉంటుంది.
