మన్యంపై మృత్యునీడ | legs pain problems in agency | Sakshi
Sakshi News home page

మన్యంపై మృత్యునీడ

Published Tue, Sep 20 2016 9:54 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

మన్యంపై మృత్యునీడ

మన్యంపై మృత్యునీడ

  • ప్రాణాంతక వ్యాధుల నీడన గిరిజనం 
  • అంతుచిక్కని వ్యాధులకు బలవుతున్న వైనం
  • తాజాగా కాళ్లవాపుతో ఓ గిరిజనుడి మృతి 
  • ఐదుకు చేరిన ‘కాళ్లవాపు’ మరణాలు 
  • కదిలిన జిల్లా యంత్రాంగం
  •  
    అంతుచిక్కని వ్యాధికి అడవి బిడ్డలు బలైపోతున్నారు. ఏదో చిన్న ఆరోగ్య సమస్యగా మొదలైన కాళ్ల వాపు.. రోజురోజుకూ ముదిరి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. తాజాగా ఏజెన్సీలోని వీఆర్‌ పురం మండలం చిన్నమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు(45) .. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ, మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. దీంతో ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఎట్టకేలకు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టింది.
     
     
    బాధితుల తరలింపునకు చర్యలు
    వీఆర్‌ పురం :
    కాళ్లవాపు లక్షణాలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ పవన్‌కుమార్‌ తెలిపారు. కాళ్లవాపుతో మరణించిన కారం రామారావు స్వగ్రామమైన చినమట్టపల్లిలో మంగళవారం వైద్య సిబ్బంది చేపట్టిన ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. కాళ్లవాపుlలక్షణాలున్న వారు రక్త నమూనాలు ఇచ్చేందుకు కానీ, పరీక్షలు చేయించుకునేందుకు కానీ నిరాకరిస్తే.. నిర్బంధంగానైనా ఆస్పత్రికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ వ్యాధి లక్షణాలున్న కొంతరిని రేఖపల్లి పీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలించారు. పోలవరం (భూసేకరణ ) డిప్యూటీ కలెక్టర్‌ ఎల్లారమ్మ, డిప్యూటీ కలెక్టర్‌(స్పెషలాఫీసర్‌) పి.శ్రీరామచంద్రమూర్తి, తహసీల్దార్‌ జీవీఎస్‌ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్‌ పాల్గొన్నారు.
     
     
    గిరిజనుడిని బలిగొన్న ‘కాళ్లవాపు’
    కాకినాడ సిటీ : జిల్లాలోని విలీన ప్రాంతమైన వీఆర్‌పురం మండలం చినమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు(45) కాళ్ల వాపు వ్యాధితో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ, మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. కాళ్లవాపు, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్న రామారావును అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఈ నెల 18న కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఏఎంసీ–1లో వెంటిలేటర్‌పై ఉంచి, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే వీఆర్‌పురం మండలంలో నలుగురు మరణించగా, తాజాగా రామారావు మృతితో కాళ్లవాపు వ్యాధి మరణాల సంఖ్య ఐదుకు చేరింది.
     
    29 మంది డిశ్చార్జి
    కాళ్లవాపు వ్యాధితో బాధపడుతున్న 32 మంది గిరిజనులు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరిని ఈ నెల 8, 9 తేదీల్లో జీజీహెచ్‌కు తరలించగా, ప్రత్యేక వార్డులో ఉంచి, వైద్య సేవలందించారు. వీరిలో 29 మంది ఆరోగ్యం మెరుగుపడడంతో, మంగళవారం ఆస్పత్రిలో సీఎస్‌ఆర్‌ఎంఓ టీఎస్‌ఆర్‌ మూర్తి నేతృత్వంలో వైద్యులు విశాఖ నుంచి వచ్చిన నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ కిరణ్‌ మహేష్, ఏఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్‌ లకో్ష్మజీనాయుడు, మెడిసిన్‌ చీఫ్‌ డాక్టర్‌ సీఎస్‌ఎస్‌ శర్మ సమావేశమై చర్చించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల సూచనలతో 29 మందిని డిశ్చార్జి చేసి, ప్రత్యేక వాహనంలో ఇళ్లకు పంపించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
     
    జాతీయ బృందం రాక
    కాగా రెండు రోజుల్లో నేషనల్‌ లేబొరేటరీ నుంచి ప్రత్యేక బృందం జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. ముంపు మండలాల్లో కాళ్ల వాపు వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించి, శాంపిళ్లను సేకరిస్తుందని తెలిపారు.
     
     
    వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తాం
     
    చింతూరు : ఏజెన్సీలోని పీహెచ్‌సీల్లో వైద్య సౌకర్యాలు మెరుగు పరుస్తామని, సిబ్బంది కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చంద్రయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలీన మండలాల్లోని పీహెచ్‌సీలను ఆకస్మిక తనిఖీ చేశారు. చింతూరులో ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరతపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, డిప్యుటేషన్‌పై స్టాఫ్‌నర్సులను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి అధికంగా ఉందని, వీరిలో 19 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నట్టు తెలిపారు. వీరిలో నలుగురికి వ్యాధి తీవ్రత అధికంగా ఉండగా, వీరిలో ఒకరు మంగళవారం మరణించినట్టు చెప్పారు. కొందరు గిరిజనులు తాగుతున్న నాటుసారాను పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. చింతూరులో ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఏజెన్సీలో ప్రతి మండలానికి ఒక డాక్టర్‌తో బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నాటుమందులు ఆశ్రయించి ప్రాణాపాయం కొనితెచ్చుకోవద్దని కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement