యావజ్జీవ తీర్పు..నేరస్తులకు కనువిప్పు
యావజ్జీవ తీర్పు..నేరస్తులకు కనువిప్పు
Published Wed, Sep 28 2016 11:08 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ
కర్నూలు: బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మానవమృగం పఠాన్‌ఖాజాఖాన్‌కు జీవించినంతకాలం యావాజ్జీవ కారాగార జైలు శిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా మొదటి అదనపు జడ్జీ ప్రేమావతి ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పులాంటిదని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేంద్రప్రసాద్, దర్యాప్తు అధికారి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తితో కలిసి బుధవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై పోక్‌షో (పీఓసీఎస్‌ఎస్‌ఓ) చట్టం బ్రహ్మస్త్రం లాంటిదన్నారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి ఈ తీర్పు గుణపాఠమన్నారు.
కర్నూలు నగరం కడక్‌పుర వీధిలో ఉండే పఠాన్‌ఖాజాఖాన్ ఆటో డ్రై వర్‌గా పని చేస్తూ జీవనం సాగించే వాడని, 2015, జూలై 18వ తేదీన అదే కాలనీలో నివాసం ఉంటున్న మైనర్ బాలికను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి బంధించి అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో జడ్జి సంచలన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టిన డీఎస్పీ రమణమూర్తిని అభినందించారు. అప్పటి ఒకటో పట్టణ సీఐ రామకృష్ణ, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని కూడా ఎస్పీ అభినందించారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ.. మహిళా నేరాలకు పాల్పడిన మట్టి రవి, నాగేంద్ర, దేవ, కాశీం తదితరులపై కూడా కఠినమైన చట్టాలు ప్రయోగించి శిక్షలు పడేలా పోలీసు శాఖ కృషి చేసిందన్నారు. సీఐలు వీఆర్ కృష్ణయ్య, పీ.రామకృష్ణ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
Advertisement