కుమిలిపోతున్నారు..! | Female Employees of Sexual Harassment | Sakshi
Sakshi News home page

కుమిలిపోతున్నారు..!

Published Mon, Mar 5 2018 10:43 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Female Employees of Sexual Harassment - Sakshi

జగిత్యాల మండల పరిధిలో ఓ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలు తనను ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎస్పీ అనంతశర్మను వారం రోజుల క్రితం ఆశ్రయించింది. తనపై జరిపిన వేధింపులను వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. ప్రధానోపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన ఎస్పీ సమస్యపై కలెక్టర్‌ శరత్‌తో చర్చించారు. ఇంత వరకు ఆమెకు న్యాయం జరగలేదు.

మూడు నెలల క్రితం జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో పని చేసే ఓ ఉపాధ్యాయురాలిని అదే పాఠశాలలో పని చేసే కింది స్థాయి ఉద్యోగి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఈవిషయమై ఆమె నిలదీసింది. ఈ వ్యవహారం తెలుసుకున్న సదరు గురుకులం బాధ్యులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చి.. ఒప్పంద పత్రం రాయించారు. ఉద్యోగం పోతుందనే భయంతో సదరు టీచర్‌ తనకు జరిగిన మోసాన్ని ఎవరికీ చెప్పుకోలేదు.

ఐదు నెలల క్రితం.. మల్యాల మండలంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగినిని.. ఆమె పైఅధికారి లైంగికంగా వేధించాడు. దాదాపు రెండు నెలలపాటు ఆ అధికారి వేధింపులు భరించిన ఆ ఉద్యోగిని నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సదరు అధికారిపై ఫిర్యాదు చేసింది. దీంతో సమగ్ర విచారణ జరిపిన కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ వెంటనే సదరు అధికారిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

వెలుగులోకి రాని ఇలాంటి సంఘటనలు ఇంకా ఉన్నాయి. ఉద్యోగం పోతుందనే భయంతో కొందరు.. పరువు పోతుందని ఇంకొందరు.. ప్రాణభయంతో పలువురు మహిళా ఉద్యోగులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ప్రతీక్షణం నరకయాతన అనుభవిస్తున్నారు. పని చేసే కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి విషయాలు వెలుగులోకి రాకపోవడంతో ఎవరికీ తెలియడంలేదు. ఒకేచోట     మహిళలతో కలిసి పని చేస్తూ వారిపై కన్నేసి.. లైంగికంగా లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్న సదరు ఉద్యోగులపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఉన్నతాధికారులూ చర్యలు తీసుకోవడం లేదు. చివరకు సహనం కోల్పోయి వేరే దిక్కు లేక బాధిత మహిళలు పోలీసులు, అధికారులను     ఆశ్రయిస్తున్నారు. మహిళా రక్షణకు ఎన్ని చట్టాలున్నా వాటిపై అవగాహన లేకపోవడంతో బాధితులు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు.

సాక్షి, జగిత్యాల : జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులు సుమారు మూడువేల మంది ఉన్నారు. ఔట్‌సోర్సింగ్, క్రాంటాక్ట్‌ పద్ధతిలో మరో మూడువేల మంది పని చేస్తున్నారు. వీరితోపాటు 3,770 మంది ఉపాధ్యాయులున్నారు. అన్నిశాఖల్లో కలిపి 3,500 మంది వరకు మహిళలు ఉన్నారు. కలెక్టరేట్, వైద్యశాఖ, విద్యాశాఖలో సింహభాగం మహిళలే ఉన్నారు. మిగిలిన శాఖల్లో తక్కువ మంది ఉన్నారు. అయితే.. పలు శాఖల్లో ఒంటరిగా ఉన్న... వితంతువులు.. తాత్కాలిక ఉద్యోగాల్లో పని చేస్తోన్న మహిళలను వారితో కలిసి పని చేస్తోన్న ఉద్యోగులు, అధికారులు వక్రబుద్ధితో వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు పనికి ఒప్పుకోనివారిపై కక్షగడుతున్నారు. పనితీరు బాగాలేదంటూ అందరి ఎదుట కించపర్చిన సంఘటనలూ ఉన్నాయి. మల్యాలలో ఓ అధికారి తన కింద పనిచేస్తున్న ఓ వితంతువుపై కన్నేసి కటాకటాల పాలైన సంఘటనే ఇందుకు నిదర్శనం. పలు కార్యాలయాల్లో జరుగుతున్న ఈ వేధింపుల గురించి సంబంధిత జిల్లా అధికారులకు చెప్పుకునే ధైర్యాన్ని బాధిత మహిళలు చేయలేకపోతున్నారు.

కమిటీ ఉన్నా.. ఫలితం సున్నా..!
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఐదు నెలల క్రితం కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ జిల్లాలో ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుగంధిని, జగిత్యాల ఎంపీడీవో శ్రీలత, కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ వాణిరెడ్డి, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ,, మరో తహసీల్దార్‌ను ఇందులో నియమించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సహచర మహిళను లైంగికంగా వేధించినట్లు నిరూపణ అయితే వారిని సస్పెండ్‌ లేదా బదిలీ చేసే లేదా పదోన్నతి పొందకుండా చర్య తీసుకునే అధికారం ఈ కమిటీకి ఉంది. అయితే.. ఈ కమిటీ ఏర్పాటై ఐదు నెలలైనా ఇంత వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు.

కనీసం ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు..? ఫిర్యాదు ఎవరికి..? ఎలా చేయాలి.? అని కూడా బాధితులకు తెలియకపోవడం గమనార్హం. కనీసం తమ హక్కులు.. భద్రత విషయంపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవగాహన కల్పించలేదని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కమిటీ సమర్థవంతంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఓ ఉపాధ్యాయురాలు డిమాండ్‌ చేశారు. ఈ విషయమై కమిటీ సభ్యురాలు వాణిరెడ్డి వివరణ ఇస్తూ.. ‘కమిటీ ఏర్పాటైన తర్వాత సమావేశం నిర్వహించుకోలేదు. ఇప్పటి వరకు కమిటీకి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఫిర్యాదు వస్తే పోలీసు కేసు పెట్టి.. తప్పకుండా చర్యలు తీసుకుంటాం’ అన్నారు.

వేధింపుల నిరోధక కమిటీ విధులివే..
వేధింపుల నిరోధక కమిటీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళకు అండగా ఉంటూ 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. కమిటి చేసిన సిఫారసుల అమలు కోసం బాధిత మహిళా ఉద్యోగిని పనిచేసే కార్యాలయ అధికారికి, సంస్థ యజమాన్యానికి జిల్లా అధికారి 60 రోజుల గడువు ఇవ్వాలి. విచారణ జరుగుతున్న కాలంలో ఆ మహిళాఉద్యోగి స్వచ్ఛంద బదిలీ, సెలవు కోరినా ఇవ్వాలి. కమిటీకి రూ.50 వేల జరిమానా, పదోన్నతులు నిలిపివేయడం, సస్పెన్షన్‌ చేసే వీలుంటుంది. బాధిత మహిళా ఉద్యోగి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌కు ఐపీసీ సెక్షన్‌ కింద కేసు పెట్టదలుచుకుంటే ఆమెకు అధికారులు పూర్తిగా సహకరించాలి. నిరోధక కమిటీలు ఏర్పాటు చేయడంలో సంస్థలు విఫలమైతే ఆ శాఖ అధికారులపై, సంస్థల యజమాన్యాలపై కలెక్టర్‌ చర్య తీసుకుంటారు.

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నియంత్రణ చట్టం 2013 సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగా లైంగిక వేధింపులు అనే పదానికి ఈ చట్టంలో ఈ నిర్వచనం పొందుపరిచారు. ఇందులో పలు అంశాలు.

లైంగిక చర్యల కోసం ఒత్తిడి, అసభ్య ద్వందార్థాల వ్యాఖ్యలు, సైగలు, లైంగిక చర్యల కోసం ఒత్తిడి, అశ్లీల చిత్రాలు చూపించడం వంటి వాటివి లైంగిక వేధింపుల కిందకు వస్తాయి. మహిళ ఉద్యోగులు, కార్యాలయాలకు పనులపై వచ్చే మహిళలు, దినసరి, కాంటింజెంట్, అవుట్‌సోర్స్, కాంట్రాక్ట్, తాత్కాలిక మహిళ ఉద్యోగినిలు, శిక్షణార్థం వచ్చిన మహిళలు, ప్రభుత్వరంగ సంస్థల్లోని కార్యాలయాల్లో, కంపెనీల్లో, కార్ఖనాల్లో పనిచేస్తున్న మహిళలు ఈ చట్టం పరిధి కిందికి వస్తారు.

ప్రతీ కార్యాలయం, సంస్థ పరిధిలో పురుషులకు మించి మహిళలుంటే అంతర్గత కమిటీలు వేసుకునే వీలుంది. కానీ.. జిల్లాస్థాయిలో మాత్రం లైంగిక వేధింపుల నిరోధక కమిటీ తప్పకుండా ఏర్పాటు చేయాలి. ఇందులో వివిధ శాఖల నుంచి మహిళా అధికారులను నియమించాలి.

కఠినంగా వ్యవహరిస్తాం
ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే పలు కార్యాలయాల్లో వేధింపుల విషయం నా దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఇద్దరిని సస్పెండ్‌ కూడా చేశా. లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఐదుగురు అధికారులతో జిల్లాస్థాయి కమిటీ  ఏర్పాటు చేశా. బాధితులు నిర్భయంగా కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ప్రైవేట్‌ ఉద్యోగినులకూ రక్షణ కల్పిస్తాం.
– డాక్టర్‌ శరత్, కలెక్టర్‌

ఫిర్యాదులు వస్తున్నాయ్‌..
జిల్లాలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. ఇంకా పలువురు ఫిర్యాదు చేశారు. వాటిపై విచారణ చేపడుతున్నాం. మహిళలను లైంగికంగా వేధిస్తే చట్టపరంగా చర్య తీసుకుంటాం. మహిళలు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.  
– అనంతశర్మ, ఎస్పీ, జగిత్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement