
ఊపిరున్నంతవరకు పాదయాత్ర
- 24ఏళ్లుగా దేశవ్యాప్తంగా భగీచాసింగ్ యాత్ర
- గుట్కాలు, భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, మద్యం నిషేధంపై పోరాటం
- 1992లో హర్యానాలో యాత్ర ప్రారంభం.. 23రాష్ట్రాల్లో పూర్తి
- మొత్తం 5.90లక్షల కి.మీ. ప్రయాణం
- తెలంగాణలోకి అడుగు..
తాండూరు: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు భగీచాసింగ్. 82ఏళ్లు. ఈయన భుజాన పెద్దపెద్ద బ్యాగులు.. జాతీయ జెండాలు చూస్తేంటే ఎవరో పర్వతారోహకుడు అనిపిస్తోంది కదూ. అదేమీ కాదు.. గుట్కాలు, సిగరెట్లు, భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, మద్యం నిషేధించాలని 24ఏళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్నాడు. భుజాన 90 కిలోల భరువున్న బ్యాగులు మోస్తూ 1992లో హర్యానాలో మొదలైన ఆయన ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 23 రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేశాడు. ఆదివారం ఆయన పాదయాత్ర కర్ణాటక రాష్ట్రం చించోళి మీదుగా తాండూరు పట్టణంలోకి ప్రవేశించింది. మొదట్లో రోజుకు 40కి.మీ. పాదయాత్ర చేసిన ఆయన ప్రస్తుతం కంటిచూపు మందగించడంతో 20కి.మీ.చేస్తున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా దృఢసంకల్పంతో తన యాత్ర ముందుకు సాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు 5.90లక్షల కి.మీ. ప్రయాణం చేసినట్టు చెప్పారు. పాదయాత్రలో భాగంగా తనను కలిసే పెద్దల నుంచి విరాళాలతోనే భోజనం, ఇతర అవసరాలకు తీర్చుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమాజంలో గుట్కాలు, సిగరెట్లు, మద్యం తదితర అలవాట్లతో యువత చెడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో మార్పు రావాలన్నదే తన తాపత్రయమన్నారు. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు తదితర సామాజిక దురాగతాలను నిర్మూలించడానికి ఈ పాదయాత్ర దోహదపడాలన్నదే తన ఆశయమని వివరించారు. హైదరాబాద్ చేరుకున్నాక సీఎం కేసీఆర్‌ను కలుసుకుంటానని, తరువాత ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తానని భగీచాసింగ్ వివరించారు. ‘పాదయాత్ర ఎప్పుడు ముగిస్తానో నాకు తెలియదు.. ఎప్పటి వరకు చేస్తానో కూడా తెలియదు.. ఊపిరి ఉన్నంత వరకు కొనసాగిస్తూనే ఉంటాను’ అంటున్నారు.