బతికుండగానే శ్మశానానికి తరలించారు | liveing man carrying at barrial ground | Sakshi
Sakshi News home page

బతికుండగానే శ్మశానానికి తరలించారు

Published Mon, Aug 8 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

తిరుమల  శ్మశానంలో మూటలో మూలుగుతున్న వృద్ధుడు ప్రీతమ్‌ శివాజి బోస్లే

తిరుమల శ్మశానంలో మూటలో మూలుగుతున్న వృద్ధుడు ప్రీతమ్‌ శివాజి బోస్లే

 
–తిరుమలలో  వ్యాధిగ్రస్తుడిని మూటకట్టి శ్మశానంలో
 వదిలిపెట్టిన టీటీడీ ఔట్‌సోర్సింగ్‌  సిబ్బంది
–సీఐ వెంకటరవి సహకారంతో 
 –అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి వైద్యసాయం
–తమకు సంబంధం లేదని తేల్చిన హెల్త్‌ అధికారులు
– నిందితులు గుర్తించి చర్యలు తీసుకుంటామంటున్న సీఐ 
సాక్షి,తిరుమల:
మానవసేవే మాధవ సేవగా సేవలందించాల్సిన టీటీడీ సిబ్బంది  ఏడుకొండల వెంకన్న సాక్షిగా మానవత్వాన్ని మంట కలిపారు. ఆలయానికి కూతవేటుదూరంలోనే  బతికుండగానే ఓ వృద్ధుడిని శ్మశానానికి తరలించిన ఘటన సోమవారం తిరుమలలో జరిగింది. పోలీసుల సహకారంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. 
ఆయననెవరు ? l
మహారాష్ట్రలోని శిరిడీ క్షేత్రానికి  20 కిలోమీటర్లదూరంలోని కోపర్‌గావ్‌ పట్టణానికి చెందిన ప్రీతమ్‌ శివాజి బోస్లే (75). శ్రీవారి దర్శనానికి వచ్చాడు.  అనారోగ్యంతో కొన్ని రోజులుగా తిరుమలలోనే బతుకుబండిని లాగిస్తున్నాడు. అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆలయానికి కూతవేటు దూరంలోని ∙ రాంబగీచా అతిథిగృహం వద్ద భక్తులు, స్థానికులు ఇచ్చిన ఆహారాన్ని తిని బతుకుతున్నాడు. ఆరోగ్యం క్షీణించటంతో నడవలేని స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో అతను నిద్రించే ప్రాంతంలో చీమలు పట్టి, రక్తం, నెత్తురు కారే స్థితిలో దుర్వాసన మధ్య అతను కాలాన్ని సాగిదీశాడు.
 
బతికుండగానే శ్మశానానికి తరలింపు
నడవ లేని స్థితిలో మూలుగుతున్న  ఆ వృద్ధుడిని టీటీడీ పారిశుద్ధ్య ఔట్‌సోర్సింగ్‌  సిబ్బంది సోమవారం చూసారు. చీము, నెత్తురు కారుతూ కనిపించిన ఆయన  పరిస్థితి చూసి ఒకటి రెండు రోజుల్లోనే మరణించే అవకాశం ఉందని భావించినట్టున్నారు. మరణించిన తర్వాత  కంటే ముందే తీయటం సులభమనే ఉద్దేశంతో  భావించినట్టున్నారు. టీటీడీ హెల్త్‌ అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా సొంత నిర్ణయం తీసుకున్నారు. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించే లారీ తీసుకొచ్చారు. ఓ ప్లాస్టిక్‌ సంచిలో అతన్ని మూటకట్టారు. లారీలో వేసుకుని ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని శ్మశానంలో మూటగా దింపి సమాధులు మధ్య వదిలిపెట్టి వచ్చేశారు. 
 
సీఐ వెంకటరవి సహకారంతో 108 అంబులెన్స్‌ ద్వారా ఆస్పత్రికి తరలింపు
ప్రాణాలతో బతికున్న వృద్ధుడిని మూటకట్టి  చెత్తలారీలో  ఎక్కించటాన్ని అక్కడి ట్యాక్సీ సిబ్బంది చూసి మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో కొందరు మీడియా సిబ్బంది శ్మశానంలోకి వెళ్లి చూడగా  మూటలో మూలుగుతున్న వృద్ధుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ వెంకటరవి తక్షణమే శ్మశానానికి చేరుకుని మూటవిప్పి బాధితుడిని రక్షించే చర్యలు ప్రారంభించారు. బిస్కెట్లు, నీటి బాటిల్‌ తెప్పించడంతో వాటిని స్వీకరించి బాధితుడు ఆకలి తీర్చుకున్నాడు. నడవలేని స్థితిలోని బా«ధితుడిని 108 అంబులెన్స్‌లో స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. బాధితుడు కుష్టువ్యాధి గ్రస్తుడని వైద్యులు తెలిపారు. తర్వాత అతన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రి లెప్రసీవార్డుకు తరలించి వైద్యం చేయించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని సంబంధిత టీటీడీ హెల్త్‌ అధికారులు స్పష్టం చేశారు. తమ సిబ్బంది  ఎవ్వరిని లారీలో శ్మశానానికి తరలించలేదని వివరణ ఇచ్చినట్టు సీఐ వెంకటరవి మీడియాకు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, సీసీ పుటేజీ ద్వారా నిందితులు గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement