
జేసీవి దిగజారుడు రాజకీయాలు
– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గడికొండ సభలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చంద్రబాబుకు మించి అభివృద్ధి చేసే నాయకుడే లేరన్నట్లు , ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడం జేసీ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. బూట్లు నాకింటే ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవారని అంటున్న జేసీ.. మరి ఇప్పుడున్న మంత్రుల్లో ఎంతమంది చంద్రబాబు బూట్లు నాకారో చెప్పాలన్నారు.
అలాగే ఏడోతరగతి పాస్ కాని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. గద్వాల నుంచి వలస వచ్చిన జేసీ ..రాయలసీమ రెడ్ల గురించి మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అన్ని నీటి ప్రాజెక్టులూ 75 శాతానికి పైగా పూర్తయ్యాయని, తక్కిన పనులు పూర్తి చేసి చంద్రబాబు తానేదో సాధించినట్లు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో వందమంది చంద్రబాబులు వచ్చి పులివెందుల నియోజకవర్గంలో నిలబడినా కనీసం డిపాజిట్టు కూడా తెచ్చుకోలేరన్నారు. సమావేశంలో వైఎసాస్సార్‌సీపీ నాయకులు పసుపుల బాలకృష్ణారెడ్డి, బాలనరసింహారెడ్డి, ములకనూరు గోవిందు, రాజారెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.