పేద బ్రాహ్మణులకు రుణాలు
ఏలూరు సిటీ : బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులకు రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు సొసైటీ సీఈవో అభిజిత్ జయంత్ చెప్పారు. ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని శ్రీశ్రీ విద్యాసంస్థల కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు ఎస్.పేరిశాస్త్రి, డైరెక్టర్ ఎంబీఎస్ శర్మ, కార్యవర్గ సభ్యులు జి.వెంకటరామయ్యతో కలిసి ఆయన మాట్లాడుతూ 2015 అక్టోబర్ 1న సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేశామన్నారు.
బ్రాహ్మణ సమాజంలోని పేదలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ సొసైటీని బలోపేతం చేస్తూ ప్రతి జిల్లాలో సభ్యులను చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పేద బ్రాహ్మణ మహిళలతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయలనూ తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 500 మంది సభ్యులు ఇప్పటికే నమోదు చేయించుకున్నారని తెలిపారు. ఈ సొసైటీని బ్యాంకుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దీనిలో డబ్బులు దాచుకునేవారికి 4.5 శాతం వడ్డీ ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. అరుంధతి పేరుతో మహిళలకు, వశిష్ట పేరుతో పురుషులకు రుణాలు అందించే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఒక్కో గ్రూపులో ముగ్గురు నుంచి పది మంది సభ్యులు ఉండాలని, ఒక్కో గ్రూపుకు రూ. 25 వేలు రుణంగా అందిస్తామని, ఈ రుణాన్ని సంవత్సర కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని అగ్రహారంలో బ్రాహ్మణ బజార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ బ్రాహ్మణ బజార్‌లో బ్రాహ్మణులు తయారు చేసిన వస్తువులను విక్రయించుకునేలా కలెక్టర్ కాటంనేని భాస్కర్, డీఆర్‌డీఏ పీడీలతో చర్చిస్తామని తెలిపారు.