లోక్‌ అదాలత్‌లతో కేసుల నుంచి విముక్తి | lok adalath is a key | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లతో కేసుల నుంచి విముక్తి

Published Sat, Sep 10 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

సదస్సులో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ

సదస్సులో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ

శ్రీకాకుళం సిటీ : లోక్‌ అదాలత్‌ను వినియోగించుకుని కేసుల నుంచి ఉపశమనం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలాగీతాంబ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ల నిర్వహణలో భాగంగా జిల్లాలో మొత్తం 15 బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. అందులో నాలుగు బెంచ్‌లు జిల్లా కోర్టులో ఏర్పాటు చేశామని చెప్పారు. లోక్‌ అదాలత్‌లలో ఇచ్చిన తీర్పు సివిల్‌ డిక్రీలతో సమానమన్నారు. దీనిని ఎవరైనా అమలుచేయకపోతే జిల్లా కోర్టు దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు.

లోక్‌ అదాలత్‌లకు ప్రి లిటిగేషన్‌ కేసులను కూడా తీసుకురావచ్చన్నారు. ముందుగా జిల్లా న్యాయసేవాసాదికార సంస్థను సంప్రదిస్తే అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారని తెలిపారు. లక్షలోపు ఆదాయం వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమల్లో సమస్యలు ఉన్నా, సక్రమంగా అందకపోయినా, విద్య, రియల్‌ ఎస్టేట్‌ తదితర సమస్యలు ఉన్నా న్యాయసేవాసాధికార సంస్థ దృష్టికి తేవచ్చని సూచించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంగు కృష్ణారావు మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా కక్షిదారుల మధ్య విభేదాలు తొలగిపోతాయన్నారు. జిల్లా న్యాయసేవాధికారిత సంస్థ కార్యదర్శి ఎ.మేరీ గ్రేస్‌కుమారి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌కు విశేషమైన స్పందన వచ్చిందన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి.గౌతం ప్రసాద్, ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎన్‌.సుధామణి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి, నాలుగో అదనపు జడ్జి వి.గోపాలకృష్ణారావు, శాశ్వత లోక్‌ అదాలత్‌ అధ్యక్షుడు షేక్‌  ఇంతియాజ్‌ అహ్మద్, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.పద్మావతి, ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి వై.శ్రీనివాసరావు, మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి పి.సాయిసుద, న్యాయవాదులు íపి.ఇందిరాప్రసాద్, పి.ఉషాదేవి, డి.సరళాకుమారి, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌లు జె.సీతారామారావు, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మామిడి క్రాంతి, సామాజిక సేవాప్రతినిధులు బి.వి.రమణశాస్త్రి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement