బ్యాంకులకు వరుస సెలవులు.. నోట్ల ఇక్కట్లు
అమరావతి: వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో ప్రజలు నగదు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగోవ శనివారం, ఆదివారం సెలవులకు తోడు సోమవారం ప్రతిపక్షాలు బంద్‌కు పిలుపునివ్వడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో నగదు తీసుకోవడానికి ఏటీఎంలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఉన్న ఏటీఎంలలో మూడోవంతు పనిచేయడం లేదు.
దీంతో గత రెండు రోజులతో పోలిస్తే ఉన్న ఏటీఎంల వద్ద క్యూలైన్లు భారీగా పెరిగాయి. ఏటీఎంల నుంచి రోజుకు రూ. 2,500 నగదు తీసుకోవడానికి అవకాశం ఉన్నా రెండువేల నోట్లు మాత్రమే ఉంటుండటంతో అంతకుమించి తీసుకోవడానికి అవకాశం ఉండటం లేదు. రెండు రోజుల సెలవులను దృష్టిలో పెట్టుకొని ఏటీఎంలలో అధిక నగదును నింపామని, ఒకవేళ అవి అయిపోతే సోమవారం వరకు ఆగాల్సిందేనని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం బంద్ అయినా అన్ని బ్యాంకులు పనిచేస్తాయని, ఒకవేళ ఎవరైనా వచ్చి బలవంతంగా మూసివేయిస్తే మాత్రం ఏమీ చేయలేమంటున్నారు. సోమవారం బ్యాంకులను తప్పకుండా తెరవాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు.