పుష్పపల్లకిపై విహరిస్తున్న వినాయకస్వామి
స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయ ప్రత్యేకోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పుష్పపల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది.
కాణిపాకం(ఐరాల) : స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయ ప్రత్యేకోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పుష్పపల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకోత్సవాల్లో ఈసేవకు అ్యంత ప్రాధాన్యం ఉంది. మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు. మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ పరిమళభరిత పుష్పమాలికలతో తయారు చేసిన పల్లకిపై కొలువుదీరిన గణనాథుడు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఈసేవను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులతో కాణిపాకం కిక్కిరిసింది. ఉదయం ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేక పూజల అనంతరం చందనాలంకరణ చేశారు. రాత్రి 10–30 గంటలకు సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 45 అడుగుల పొడవు, 38 అడుగుల ఎత్తులో మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, ప్రత్యేక పుష్పాలంకరణతో సిద్ధం చేసిన పల్లకిపై ఉత్సవ మూర్తులను అధిష్టింపచేశారు. ప్రత్యేక వాయిద్యాలు, అశేష భక్తుల జై గణేష్ నామస్మరణల నడుమ ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేషు, ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్‌లు రవీంద్ర బాబు, స్వాములు, ఇన్‌స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
పుష్పపల్లకి సేవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చిత్తూరు డీఎస్పీ లక్ష్మినాయుడు ఆధ్వర్యంలో వెస్ట్ సీఐ ఆదినారాయణ, కాణిపాకం ఎస్‌ఐ నరేష్ బాబు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం పంచాయతీ అధికారులు మంచినీటి సౌకర్యం కల్పించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపారు. స్థానికులు పలు ప్రాంతాల్లో భక్తులకు అన్నదానం చేశారు.