అనుమానాస్పద స్థితిలో లారీడ్రైవర్ మృతి
అనుమానాస్పద స్థితిలో లారీడ్రైవర్ మృతి
Published Sun, Sep 25 2016 2:04 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
నాయుడుపేటటౌన్ : అనుమానాస్పదస్థితిలో ఓ లారీడ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మేనకూరులో శనివారం వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు.. చిట్టమూరు మండలం మెట్టుకు చెందిన దార్ల రాజశేఖర్ (24) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లిని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడు తీసుకుని మేనకూరు పరిశ్రమ కేంద్రంలోని హిందూస్తాన్ గ్లాస్ పరిశ్రమకు అన్‌లోడ్ చేసేందుకు శుక్రవారం రాత్రి వెళ్లాడు. అప్పటికే మరికొన్ని లారీలు బొగ్గు అన్‌లోడ్ చేస్తుండటంతో పరిశ్రమ బయట లారీల వెనకే రాజశేఖర్ తన లారీని నిలిపాడు. శనివారం ఉదయం లారీ పక్కనే డివైడర్‌పై చెయ్యి విరిగి అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజశేఖర్‌ను ఇతర డ్రైవర్లు గుర్తించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డుకు తెలపడంతో లారీడ్రైవర్ల సహకారంతో ఆటోలో నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తుండగా రాజశేఖర్ మృతి చెందాడు. అయితే రాజశేఖర్ మృతికి కారణాలు తెలియకపోవడంతో ఏఎస్సై కృష్ణయ్య అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
నా కొడుకును ఎవరో కొట్టి చంపేశారు..
నా కొడుకును ఎవరో కొట్టి చంపేశారంటూ మృతుడి తల్లి పెంచలమ్మ ఆరోపించింది. కొడుకు మృతి విషయం తెలుసుకుని ఆస్పత్రి వద్దకు చేరుకుని బోరున విలపించింది. భర్త మణెయ్య మృతి తర్వాత ఒక్కగానొక్క కొడుకు కుటుంబానికి ఆధారంగా ఉన్నాడని, నాకు దిక్కెవరంటూ తల్లి గుండెలు బాదుకుంటూ రోదిస్తూ సొమ్మసిలి పడిపోయింది. అందరితో సఖ్యతగా ఉండే సుబ్రహ్మణ్యం మృతితో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
Advertisement
Advertisement